Begin typing your search above and press return to search.

పాపం వారంతా ఇరుక్కుపోయారు !

By:  Tupaki Desk   |   19 Jun 2022 9:30 AM GMT
పాపం వారంతా ఇరుక్కుపోయారు !
X
ఆర్మీ నియామకాల్లో కేంద్రం ప్రకటించిన కొత్త పథకాన్ని నిరసిస్తు ఆందోళనల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న విద్యార్ధులు, అభ్యర్ధులు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయారు. ఆర్మీ ఉద్యోగాల్లో నియామకాల సంగతి ఎలాగున్నా కేసుల్లో తగులుకున్నవారందరికి కఠిన శిక్షలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అల్లర్లు, విధ్వంసాల్లో పాల్గొన్నవారందరిపైన రైల్వే పోలీసులు చాలా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు.

వందలాది ఆందోళనకారులపై రైల్వేపోలీసులు ఐపీసీ, రైల్వేయాక్ట్, పీడీపీపీఏల్లోని సెక్షన్ 15 కింద కేసులు నమోదుచేశారు. ఈ చట్టాలు, సెక్షన్ కింద నమోదైన కేసులు కోర్టులో నిరూపణైతే వీళ్ళెవరికీ భవిష్యత్తులో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అందుకునే అవకాశాలు లేవు. అలాగే కొన్ని ప్రైవేటు కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేయటానికి పనికిరాకుండా పోతారు. నేరాలు నిరూపణఅయితే సంవత్సరాల పాటు జైలు శిక్షలు పడటం ఖాయం.

ఇదే సమయంలో వీళ్ళల్లో కొందరికి దేశద్రోహం కింద ఉరిశిక్షలు పడినా ఆశ్చర్యంలేదట. ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగానే పెట్రోలు, డీజల్ తీసుకొచ్చి రైళ్ళ బోగీలను కాల్చేయటం, రైల్వే ఆస్తుల విధ్వంసానికి తెగబడటం స్పష్టంగా వీడియోల్లో కనబడుతోంది. కేసులు నమోదయ్యాయి కాబట్టి వీళ్ళపై ఉపసంహరణ అన్నది జరగదు. రాష్ట్రప్రభుత్వం పెట్టిన కేసులను మ్యానేజ్ చేసుకుని ఉపసంహరించుకునేట్లు కేంద్రం పెట్టిన కేసులను ఉపసంహరణ సాధ్యంకాదు.

రైల్వే పోలీసులు పెట్టిన కేసులన్నీ ఆడియో, వీడియోల ఆధారంగా పెట్టిన కేసులే కావటంతో ప్రత్యేకంగా ఆధారాలను కూడా వెతకాల్సిన అవసరం కూడా లేదు. కళ్ళముందే ఆస్తులను తగలబెట్టడం, విధ్వంసానికి పాల్పడటం కనబడుతోంది. ఇప్పటికే కొన్ని వందలమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చాలామందిని అరెస్టుచేసి కేసులు పెట్టేశారు. ఈ కేసుల విచారణ కూడా మామూలు కోర్టుల్లో కాకుండా ప్రత్యేక రైల్వే కోర్టులోనే జరుగుతాయి. కాబట్టి విచారణ కూడా చాలా తొందరగానే జరిగే అవకాశముంది. ఆ అల్లర్లపై కేంద్రప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందికాబట్టి ఆందోళనకారులకు శిక్షలు విధించి తీరాలని కేంద్రం పట్టుదలగా ఉంది. క్షణికావేశంలో విధ్వంసానికి పాల్పడిన వారు, దొరికిపోయిన వారందరి జీవితాలు ఇపుడు అయోమయంలో పడిపోయాయి.