Begin typing your search above and press return to search.

దేశమంతా విస్తరిస్తున్న అగ్గి

By:  Tupaki Desk   |   19 Jun 2022 5:30 AM GMT
దేశమంతా విస్తరిస్తున్న అగ్గి
X
దేశమంతా అగ్నిపథ్ పథకంపై వ్యతిరేకత విస్తరిస్తోంది. సైనిక నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి నిరసిస్తు ఆర్మీ ఉద్యోగాలకు కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్ధులు అనేక రాష్ట్రాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని రైల్వేస్వేషన్లకు మాత్రమే పరిమితమైన విధ్వంసకాండ తరువాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు పాకింది.

తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని రైల్వేస్టేషన్లు, బస్సుల విధ్వంసం వరకు పాకింది. దేశవ్యాప్తంగా వందలాది రైళ్ళు రద్దవుతున్నాయి. పదుల సంఖ్యలో రైళ్ళను రూటు మార్చుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవటం, అరెస్టులు చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆందోళనకారులు తయారవుతున్నారు. ఒకవైపు నిరసనకారులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నా ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కుతగ్గటంలేదు.

జరుగుతున్న ఆందోళనలన్నీ వ్యూహాత్మకమని అర్ధమవుతున్నాయి. అందుకనే పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసులు అల్లర్లను, విధ్వంసాన్ని అదుపు చేయలేక పోతున్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందే అని అభ్యర్ధులు ఏకైక డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అగ్నిపథ్ పథకాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను రద్దు చేసేది లేదని కేంద్రమంత్రులు తెగేసి చెప్పారు. పైగా ఆర్మీ, ఎయిర్ ఫోర్సులో తొందరలోనే ఈ పథకం కింద నియామకాలు మొదలవ్వబోతున్నట్లు రక్షణ దళాలు చీఫులు ప్రకటించారు.

రెండేళ్ల క్రితం దాదాపు క్లైమ్యాక్స్ కి చేరుకున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్ళ తర్వాత ఆగిపోయిన ప్రక్రియ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో నియామకం ప్రక్రియ ను రద్దు చేస్తు అగ్నిపథ్ పథకంలో దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం ప్రకటించటంతో అందరికీ మండిపోయింది. ఏదో పద్ధతిలో సమాధాన పరచాల్సిన కేంద్రం, సర్దుబాటు చేసుకోవాల్సిన రక్షణదళాల ఉన్నతాధికారులు అభ్యర్ధులను రెచ్చగొట్టేట్లుగా మాట్లాడుతున్నారు. దాంతో వేలాది మంది అభ్యర్ధులు మరింతగా రెచ్చిపోతున్నారు. మరీ అగ్నిపథ్ పథకం చిచ్చు ఎంత స్పీడుగా విస్తరిస్తోంది ? ఎప్పటికి ఆగుతుందనేది ఎవరు చెప్పలేకున్నారు.