Begin typing your search above and press return to search.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఈ దూకుడేంది కొడలి నాని?

By:  Tupaki Desk   |   6 Dec 2020 10:04 AM IST
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఈ దూకుడేంది కొడలి నాని?
X
సమయం.. సందర్భం లేకుండా.. చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించే తీరు రాజకీయాల్లో ఏ మాత్రం పనికి రాదు. దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా వ్యవహరించే ఏపీ మంత్రి కొడాలి నాని లాంటి వారి పుణ్యమా అని జగన్ సర్కారుకు ఎప్పటికప్పుడుకొత్త తిప్పలు తలెత్తుతున్నాయి. నోరు తెరిస్తే చాలు.. ఏదో ఒక వివాదం.. అంతకు మించిన సంచలనం. తన మాటల దూకుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న దుస్థితి.

ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం.. లేదు.. ఇప్పుడు నిర్వహించే ప్రసక్తి లేదని ఏపీ సర్కారు చెబుతున్న వేళ.. మంత్రి కొడాలి నాని ఒక అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న రమేశ్ కుమార్ ను తాము ఎస్ఈసీగా గుర్తించటం లేదని పేర్కన్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ప్రభుత్వం గుర్తించటం లేదన్న మాటతో లాభం కంటే నష్టమే ఎక్కువన్నది కొడాలి నాని ఎప్పటికి గ్రహిస్తారో? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న ఆయన.. అనుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెబుతున్నారు. తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్.. రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాయటాన్ని ప్రస్తావిస్తూ.. లేఖ రాయటానికి నిమ్మగడ్డ రమేశ్ ఎవరు? అంటూ ప్రశ్నించారు.

‘ప్రభుత్వాన్ని.. ప్రజల్ని.. గవర్నర్ ను లెక్క చేయని నిమ్మగడ్డ రమేశ్ ను ఎన్నికల కమిషనర్ గా తాము గుర్తించటం లేదన్నారు. 2018 జూన్ లో నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. అప్పుడు ఎందుకు నిర్వహించలేదు’ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ఎన్నికలు నిర్వహించనప్పుడు నిమ్మగడ్డ రమేశ్ ఏం చేశారు? అని ప్రశ్నించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే సమయంలో.. మీరేం చేశారన్న ఎదురుప్రశ్న పలువురి నోటి నుంచి వస్తుందన్న విషయాన్ని కొడాలి నాని మర్చిపోకూడదు.

రాజకీయ నేతల మీద విమర్శలు.. ఆరోపణలు.. ఘాటు వ్యాఖ్యలు బాగానే ఉంటాయి కానీ వ్యవస్థలో కీలకమైన స్థానాల్లో ఉన్న వారిపై అభ్యంతరకరమన్న విషయాన్ని ఆయన ఎందుకు మర్చిపోతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వారి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.