Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుకు అంత దమ్ముందా?

By:  Tupaki Desk   |   6 March 2018 4:44 PM GMT
మోడీ సర్కారుకు అంత దమ్ముందా?
X
భారతీయ జనతా పార్టీ దురహంకారానికి ఇది తాజా నిదర్శనం. త్రిపురలో ఇరవయ్యేళ్లుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న సీపీఎంను మట్టి కరపించి.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. ఆ పార్టీ అభిమానులకు దేశమంతా ఇది పండగ లాంటి కబురే. పైగా అక్కడ గెలుస్తామో లేదో అనే అనుమానంతో స్థానిక పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నది భాజపా. కాకపోతే అచ్చంగా మోడీ సర్కారు మాదిరిగా వారికి సింగిల్ పార్టీ గానే ప్రభుత్వానికి అవసరమైనంత మెజారిటీ కూడా దక్కింది.

బహుశా అదే వారిలో జడలు విప్పుతున్న రాక్షసత్వానికి దురహంకారానికి కారణం, మూలం అయి ఉండవచ్చునని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. త్రిపురలోని రష్యా జాతీయ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని భాజపా కార్యకర్తలు బుల్ డోజర్ తో కూల్చి నాశనం చేయడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సహనానికి మారుపేరైన భారతదేశంలోనే ఇలాంటి దుష్కృత్యాలు జరుగుతున్నది అని జనం బాధపడుతున్నారు. ఇది ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందనేది పక్కన పెడదాం.. అధికారం అహంకారంగా మారి కళ్లు నెత్తికెక్కితే కమలదళం ఎంత ఘోరంగా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనం అని అంతా అనుకుంటున్నారు.

ఇదొక ఎత్తు అయితే.. మరో వైపు తమిళనాడులోని హెచ్.రాజా అనే భాజపా నాయకుడు.. తమ పార్టీకి చేటు చేయాలని కంకణం కట్టుకున్నాడో ఏమో గానీ.. లెనిన్ విగ్రహం కూల్చివేతను సమర్థిస్తూ - తమిళనాడులో పెరియార్ విగ్రహం కూల్చి వేయడమే తర్వాత వంతు అని చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. లెనిన్ విగ్రహం కూల్చేశాక.. విదేశీ నాయకుల విగ్రహాలు మనకు వద్దు.. అంటూ భాజపా మంత్రి హన్స్ రాజ్ వంటి వాళ్లు అసహ్యమైన వాదన తెచ్చారు.

ఇప్పుడీ హెచ్.రాజా.. ఇంకీ నేలబారుగా పెరియార్ విగ్రహాన్ని కూల్చేస్తాం అనడం చూస్తోంటే.. మోడీ సర్కారుకు అంత దమ్ముందా అంటూ.. దక్షిణాది ప్రజలు కత్తులు నూరుతున్నారు. అసలే తమిళనాడులో భాజపాకు ఠికానా లేదు. అలాంటిది.. పెరియార్ వ్యతిరేక వ్యాఖ్యలు - ఆయన విగ్రహాన్ని కూల్చేస్తాం అనే మాటల ద్వారా.. ఆ పార్టీ భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నదని కూడా పలువురు అనుకుంటున్నారు. తమిళులు దేవుడిలా కొలిచే పెరియార్ ఎంతటి జాతి మొత్తం గౌరవించాల్సిన సంఘసంస్కర్తో చాలా మందికి తెలుసు. మరి కమల నాయకులు కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నరేమో తెలియదనే విమర్శలు వస్తున్నాయి.