Begin typing your search above and press return to search.

మన జీఎస్టీ.. చైనాకు టేస్టీ

By:  Tupaki Desk   |   5 Aug 2016 9:55 AM GMT
మన జీఎస్టీ.. చైనాకు టేస్టీ
X
దేశం మొత్తం ఒకే రకమైన ట్యాక్సు అంటూ తీసుకొస్తున్న జీఎస్టీకి లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో అది లాభమా.. నష్టమా అన్న చర్చలు దేశమంతా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా మాత్రం ఇండియాలో జీఎస్టీ అమలైతే తమకు మంచి లాభమని ప్రకటించింది. ఇండియాలో వ్యాపారం చేస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతున్న చైనా... ఈ ట్యాక్సు తమకు ఎంతో అనుకూలమని చెబుతోంది. ఈ మేరకు అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్'లో ప్రత్యేకంగా వ్యాసాలు కూడా వచ్చాయి. జీఎస్టీని ఇండియన్ పార్లమెంటు ఆమోదించడం వల్ల చైనాకు... పలు విదేశీ సంస్థలకు లాభమని.. ఇప్పుడు ఇండియా మరింత అట్రాక్టివ్ గా మారిందని ఆ వ్యాసంలో రాశారు. ఈ బిల్లు విషయంలో ఇండియాతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధమని చైనా చెబుతోంది.

జీఎస్టీ బిల్లును తీసుకురావడం.. దాన్ని ఆమోదించుకున్న తీరుతో నరేంద్ర మోడీ క్రెడిట్ మరింత పెరిగిందని.. ప్రపంచ దేశాలన్నీ మోడీ సమర్థతను అర్థం చేసుకున్నాయని గ్లోబల్ టైమ్స్ రాసింది. మోడీ రాజకీయ భవిష్యత్తు మరింత స్థిరమయం చేసే బిల్లు ఇదని, మరోసారి ఆయన్నే భారత ప్రజలు ప్రధానిగా చేస్తారని భావిస్తున్నామని ఈ వ్యాసంలో చైనా పేర్కొంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో పన్నుల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని గుర్తు చేసిన 'గ్లోబల్ టైమ్స్' ఈ అంతరాలు తొలగితే, మరింత జీడీపీని అందుకుంటుందని అంచనా వేసింది.

ఇండియన్ జీఎస్టీని అన్ని చైనా కంపెనీలూ స్వాగతిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో పలు చైనా కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతాయని అంచనా వేసింది. ఒకసారి ఈ బిల్లుకు తుది రూపు వచ్చి అమలైన వేళ - అంతర్జాతీయ స్థాయిలో భారత పేరు ప్రఖ్యాతులు మరింతగా విస్తరిస్తాయంటూ ఆ పత్రిక రాసింది. ఇండో చైనా వ్యవహారాలు.. చైనా వ్యతిరేక దేశాలతో భారత్ సంబంధాల విషయంలో తరచూ మోడీకి, భారత్ కు యాంటీ గా తీవ్ర స్థాయిలో వ్యాసాలు రాసే గ్లోబల్ టైమ్సు ఈ విషయంలో చాలా సానుకూలంగా రాసింది. అంతేకాదు... మళ్లీ మోడీయే ప్రధాని అవుతారంటూ ఎక్కడికో తీసుకెళ్లింది.