Begin typing your search above and press return to search.

గంట కొట్టించారు.. దీపం వెలిగించారు.. వాట్ నెక్ట్స్ మోడీ?

By:  Tupaki Desk   |   6 April 2020 5:30 AM GMT
గంట కొట్టించారు.. దీపం వెలిగించారు.. వాట్ నెక్ట్స్ మోడీ?
X
భిన్న వాదనలకు తగ్గట్లే విభిన్న సంస్కృతులు మన సొంతం. ఎవరేం చెప్పినా.. దానికి కౌంటర్ వెంటనే ఇచ్చేసే అలవాటు మొదట్నించి ఎక్కువే. అలాంటి దేశంలో తన మాటను మంత్రంగా భావించేలా దేశ ప్రజల్ని ట్యూన్ చేయటంలో తనకున్న పట్టు ఎంతన్నది మరోసారి ఫ్రూవ్ చేశారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి పై యావద్దేశం చేస్తున్న పోరుకు నిదర్శనం గా ఇప్పటికే రెండు టాస్కులు ఇచ్చారు. అందుకు తగ్గట్లే.. ప్రధాని చెప్పినట్లే దేశ ప్రజలు ఆచరించటం చూస్తే.. రాబోయే రోజుల్లో మోడీ మాదిరి తన మాటతో యావద్దేశాన్ని రోజుల వ్యవధిలో ప్రభావితం చేసే నాయకుడు వస్తాడా? అన్న సందేహం కలుగక మానదు.

కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ చేపట్టాలని.. ఒక్కరోజు ఇళ్లల్లో నుంచి రాకుండా ఉండాలన్న పిలుపును దీక్షలా పాటించింది దేశం. అంతేనా.. మోడీ చెప్పిన గడువు పూర్తి అయిన వెంటనే.. ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి గంట కొట్టటం.. ప్లేట్లను మోగించటం లాంటివి మహా ఉత్సాహంగా చేపట్టింది. అనంతరం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. తాజాగా ఆదివారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆపి.. దీపాలు వెలిగించాలన్న మోడీ మాష్టారి రెండో టాస్కును యావద్దేశం పాటించింది. భారత దేశ బిగ్ బాస్ మాటకు దేశ ప్రజలు ఎంతటి విలువనిస్తారో చేతల్లో చూపించేశారు.

మోడీ కోరినట్లే ప్రజలంతా గంటలు మోగించటం.. దీపాన్ని వెలిగించటం చూసినప్పుడు.. కరోనా ఎపిసోడ్ లో మోడీ మాష్టారి మూడో టాస్కు ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు యావద్దేశం సమిష్టిగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తున్నాయి మోడీ మాష్టారి టాస్కులు. అంతేకాదు.. తామంతా ఏకతాటి మీద ఉన్న విషయాన్ని దేశ ప్రజలందరికి అర్థమయ్యేలా చేస్తున్నాయి. దీపం వెలిగించాలా? వద్దా? వెలిగిస్తే లాభమేంది? ఇలాంటి ‘షో’లు చేస్తూ మోడీ ప్రజల్ని మోసం చేస్తున్నారనే విమర్శల్ని దేశం అస్సలు పట్టించుకోవటం లేదన్నది మరోసారి స్పష్టమవుతుంది. మరి.. మూడో టాస్కు సంగతేమంటారా? కచ్ఛితంగా లాక్ డౌన్ చివరి రోజున ఏదో ఒకటి చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చూద్దాం.. మోడీ మాష్టారి మూడో టాస్కు ఏమై ఉంటుందో?