Begin typing your search above and press return to search.

అందుకే.. శ్రద్ధను చంపేశా: కోర్టులో నేరం ఒప్పుకున్న అఫ్తాబ్‌!

By:  Tupaki Desk   |   22 Nov 2022 9:30 AM GMT
అందుకే.. శ్రద్ధను చంపేశా: కోర్టులో నేరం ఒప్పుకున్న అఫ్తాబ్‌!
X
దేశ రాజధాని ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న యువతిని 35 ముక్కలుగా నరికి చంపిన కేసులో నిందితుడు అఫ్తాబ్‌ తన నేరాన్ని కోర్టులో ఒప్పుకున్నాడు. క్షణికావేశంలోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు.

తనతో సహజీవనం చేస్తున్న యువతి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అప్తాబ్‌ను పోలీసులు ఢిల్లీ పోలీసులు నవంబర్‌ 22న ఢిల్లీలోని సాకేత్‌ కోర్టులో హాజరుపరిచారు. హత్య జరిగి ఆరు నెలలు దాటిపోవడంతో తనకు చాలా విషయాలు గుర్తు రావడం లేదని అప్తాబ్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తికి వెల్లడించడం గమనార్హం.

కాగా ఈ కేసులో నిందితుడిని ఐదు రోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో అతడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో నిందితుడు అఫ్తాబ్‌ న్యాయమూర్తికి వివరించాడు. క్షణికావేశంతోనే ఆమెను చంపినట్టు తెలిపాడు. ఆ రోజు తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ బాగా గొడవ చేసిందని.. దీంతో తమిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని అప్తాబ్‌ వివరించాడు. ఆ కోపంలోనే ఆమెను హత్య చేశానన్నాడు. శరీరాన్ని బయటపారేయడం కష్టం కాబట్టి రంపం తెచ్చి 35 చిన్న ముక్కలు చేశానని వివరించాడు.

ఇప్పటికే ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిపానని న్యాయమూర్తి దృష్టికి తెచ్చాడు. పోలీసుల దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తానని వెల్లడించాడు. శ్రద్ధ శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పానని న్యాయమూర్తికి తెలిపాడు.

తాను పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదన్నాడు. తాను చెప్పినవన్నీ నిజాలేనని వివరించాడు. అయితే హత్య జరిగి ఆరు నెలలు దాటిపోవడంతో తనకు కొన్ని విషయాలు సరిగా గుర్తు లేదన్నాడు. ఈ నేపథ్యంలో విచారణలో మరిన్ని విషయాలు తేలాల్సి ఉండటంతో అతడి పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు శ్రద్ధను హత్య చేశాక ఆమెను కోయడానికి ఉపయోగించిన రంపం, బ్లేడ్‌ను గురుగ్రామ్‌లోని అడవిలో పడేసినట్టు ఆప్తాబ్‌ విచారణలో చెప్పడంతో పోలీసులు అటవీ ప్రాంతంలో విచారణ సాగించారు. అయితే పోలీసులకు అక్కడేమీ దొరకలేదు. రెండుసార్లు వెతికినా ఫలితం శూన్యం.

ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌ చెబుతున్న విషయాలు నిజమా? కాదా? అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. తప్పుడు సమాచారంతో తమను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కోర్టు కూడా అనుమతించింది. అలాగే నార్కో అనాలిసిస్‌ పరీక్షను నిర్వహించడానికి సంసిద్దమవుతున్నారు.

ఆఫ్తాబ్‌ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు కోర్టు నుంచి కూడా అనుమతి లభించడంతో నేడు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దీని తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష కూడా జరపనున్నారు.

కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును ఎందుకు విచారించకూడదు. ఇందులో సీబీఐ అవసరం ఏముంది? అని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్‌ను కొట్టేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.