Begin typing your search above and press return to search.

భీభత్సం సృష్టిస్తున్న ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్!

By:  Tupaki Desk   |   15 May 2020 2:20 PM IST
భీభత్సం సృష్టిస్తున్న ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్!
X
దేశంలో ఒకవైపు వైరస్ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంటే ..మరోవైపు ఈశాన్య భారతం లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఈ వైర‌స్ బారిన‌ప‌డి అసోంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. ఫిబ్ర‌వ‌రిలో ఇక్కడ తొలి స్వైన్ ఫీవ‌ర్ కేసు నమోదు కాగా...ఆ తరువాత కొంచెం కొంచెం ఉగ్రరూపం దాల్చడంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వ్యాధి నివార‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు పందుల‌ను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. కేవలం వైరస్ సోకిన పందులని మాత్రమే చంపాలని నిర్ణయించారు.

ఇక వ్యాధి బారిన ప‌డి చ‌ని పోయిన పందులకు కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా ప‌రిహారం అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడ‌త‌లో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాల‌ని కేంద్రాన్ని కోరింది. ఇక‌ రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజు రోజుకీ పందుల మ‌ర‌ణాలు పెరుతున్నాయ‌ని, ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌భావం ప‌ది జిల్లాల‌కు సోకింద‌ని తెలిపారు.

ఇప్పటికే 14,919 పందులు చనిపోయాయ‌ని, వీటి సంఖ్య మ‌రింత పెరుగుతోంద‌న్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితిని కేంద్రానికి వివ‌రించి అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు మరోవైపు బాధిత పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది . కాగా, ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ అనేది జంతువుల‌కు సోకే వైర‌స్‌. ఇది మ‌నుషుల‌కు వ్యాప్తి చెంద‌దు. జంతువుల నుంచి ఇత‌ర జంతువుల‌కు సోకే ఈ వైర‌స్ భార‌త్ ‌లో వ్యాపించ‌డం ఇదే మొద‌టి సారి. చైనా నుంచి ఈ వ్యాధి వ‌చ్చిన‌ట్లు అసోం తెలిపింది.