Begin typing your search above and press return to search.

అద్నాన్ సమీ ఓపెన్ హార్ట్

By:  Tupaki Desk   |   1 Oct 2016 9:41 AM GMT
అద్నాన్ సమీ ఓపెన్ హార్ట్
X
ఏ జిల్లా.. ఏ జిల్లా.. పిల్లా నీది ఏ జిల్లా అంటూ తన పాటతో తెలుగు సినీ అభిమానులను ఉర్రూతలూగించిన పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీ తాజాగా భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత్ కు మద్దతుగా మాట్లాడారు. భారత సైన్యం చేసిన పనిని ఆయన మెచ్చుకుంటూ ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టారు. బాలీవుడ్ లో ప్రముఖ సింగరైన అద్నాన్ సమీ తెలుగు సీని అభిమానులకూ సుపరిచుతుడే.. పాక్ దేశీయుడైన ఆయన చాలాకాలంగా ఇండియాలో ఉంటున్నారు.. గత ఏడాది ఆయనకు భారత పౌరసత్వం లభించింది.

ప్రస్తుతం భారత పౌరుడైన ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. భారత్ సర్జికల్ దాడులను సమర్థిస్తూ అద్నాన్ ట్విట్టర్‌లో పోస్టు చేయగానే భారతీయులు ఆనందపడిపోయి ట్విట్టర్‌లోనూ ఫేస్‌బుక్‌లోనూ తమ అభినందనల వ్యాఖ్యలను పెట్టారు. సర్జికల్ దాడులకు అద్నాన్ ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ ట్విట్టర్‌ లో పోస్టు చేశారు.

కాగా అద్నాన్ వ్యాఖ్యలపై పాక్ లో మండిపడుతున్నారు. అద్నాన్ తండ్రి పాక్ విదేశాంగ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేశారు. పాక్ రాయబారిగానూ ఆయన పనిచేశారు. దీంతో అలాంటి వ్యక్తి కొడుకుగా అద్నాన్ పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే పాక్ భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అద్నాన్ మాటలే నిజమైతే.. ఆయన తండ్రి కూడా అదే పని చేశారా అని పాక్ లో ప్రశ్నిస్తారు. మరోవైపు పాక్ నటులకు మహారాష్ట్ర నవ నిర్మాణసేన వార్నింగులు ఇవ్వడం... అందులో అద్నాన్ ప్రస్తావన కూడా తేవడంతోనే ఆయన వెంటనే స్పందించి భారత్ కు అనుకూలంగా మాట్లాడారు అనేవారూ ఉన్నారు. అయితే.. అద్నాన్ ఇంతకుముందు కూడా భారత్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్న సందర్భాలున్నాయి. సినీ గాయకుడు కావడానికి ముందే అద్నాన్ ఇండియాకు వచ్చేసి పాప్ సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు పాక్ నుంచి కెనడా, అమెరికా వెళ్లి అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాని తాను ఇండియాకు వచ్చి విజయం సాధించానని... ఎవరైనా సక్సెస్ కోసం అమెరికాయే వెళ్లనవసరం లేదు, ఇండియా వచ్చినా చాలని అర్థమైందని చాలాకాలం కిందటే అద్నాన్ సమీ చెప్పాడు. దీంతో ఇప్పడు ఆయన మనం పాక్ పై చేసిన దాడులను సమర్థించడంలో వింతేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/