Begin typing your search above and press return to search.

దెబ్బయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ టీడీపీలోకి..

By:  Tupaki Desk   |   14 Sep 2015 9:45 AM GMT
దెబ్బయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ టీడీపీలోకి..
X
ఏపీ శాసనమండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఇటీవలే పోగొట్టుకున్న రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధమవుతోంది. వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నుంచి ఫ్లోర్ లీడర్ ను చేయడం వరకు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకున్న ఆయన అదే పద్ధతిలో ఊహించని విధంగా హఠాత్తుగా పదవి పొగుట్టుకున్నారు. మండలిలో ఆయన మెతకగా ఉంటూ టీడీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణతో పార్టీ అధినేత జగన్ ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ లకు ఆ పదవి అప్పిగించారు. దీంతో ఆదిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

నిజానికి ఆదిరెడ్డి అప్పారావు తన వియ్యంకుడు, మాజీ కేంద్ర మంత్రి, ట టీడీపీ సీనియర్ నేత కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కాదని అప్పట్లో వైసీపీలో చేరారు. అయితే... ఇప్పుడు ఎర్రన్న లేనప్పటికీ, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ఆదిరెడ్డి కొద్దికాలంగా ఎర్రన్న కుటుంబంతో రాజకీయ సంబంధాలు నడుపుతున్నారన్నది జగన్ అనుమానం ... అందుకే ఆయన్ను పదవి నుంచి తప్పించారని తెలుస్తోంది. దీంతో ఎలాగూ ముద్ర వేశారు కాబట్టి టీడీపీలో చేరితే అచ్చెన్నాయుడు - రామ్మోహన్ ల అండతో అధినేత చంద్రబాబు సహకారంతో పార్టీలో ఎదగొచ్చన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరిక కు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.