Begin typing your search above and press return to search.

తెదేపాలోకి 'ఆది' : ముహూర్తం ఖరారేనా?

By:  Tupaki Desk   |   23 Sep 2015 4:06 AM GMT
తెదేపాలోకి ఆది : ముహూర్తం ఖరారేనా?
X
ఇక ముహూర్తం నిర్ణయించడం ఒక్కటే తరువాయి. తతిమ్మా ఏర్పాట్లు మొత్తం పూర్తయిపోయాయి. కడపజిల్లా జమ్మలమడుగుకు చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నట్లున వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. కానీ, స్థానిక సమీకరణల రీత్యా చాలాకాలంగా తాను గెలిచిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా చూస్తే.. ఆయన వైకాపాకు దూరమైనట్లే లెక్క. కాకపోతే.. తెలుగుదేశం నాయకులతో ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న రాయబారాలు ఒక కొలిక్కి వచ్చేశాయని త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరుగుతోంది.

ఆదినారాయణరెడ్డి - జగన్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత కొన్ని పరిణామాల్లో పార్టీ తనకు అండగా నిలవలేకపోయిందన్న అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. అప్పటినుంచి వైకాపాకు దూరం జరిగారు. పార్టీకార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనడం లేదు. సరికదా, వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే పలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. జగన్‌ ఒంటెత్తు పోకడలు పోతున్నారని, ఆయన ఎవ్వరి మాటలను చెవిలో వేసుకునే స్థితిలో లేరని ఆదినారాయణ రెడ్డి గతంలో పలుమార్లు విమర్శించారు. అయితే ఆయన తెదేపాలో చేరిపోతారనే పుకార్లు కూడా గతంలో చాలాసార్లు వచ్చాయి గానీ.. తుదిరూపు దిద్దుకోలేదు.

ప్రస్తుతం కడపజిల్లాలో తెదేపాకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. ఆదినారాయణరెడ్డి తో అధికార పార్టీ మంతనాలు పూర్తయ్యాయని.. ఇక ఆయన పార్టీలో చేరడం ఒక్కటే మిగిలి ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని అధికారపార్టీ తమలో కలిపేసుకోవడం అనే వ్యవహారం మీద.. తెలంగాణలో సుదీర్ఘ పోరాటంచేస్తున్న తెదేపా.. ఏపీలో తాము కూడా అదే పని చేస్తుండడమే తమాషా!