Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి మ‌రో వికెట్ అవుట్‌..!

By:  Tupaki Desk   |   1 Sept 2019 11:02 AM IST
టీడీపీ నుంచి మ‌రో వికెట్ అవుట్‌..!
X
బీజేపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. వివిధ పార్టీల నేత‌లు కాషాయం కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈక్ర‌మంలోనే కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత.. మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ మేరకు ఆయ‌న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకోనున్నార‌నే ప్రచారం జరుగుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత జగన్ తో విబేధించి టీడీపీలో చేరారు. మంత్రి పదవి కూడా చేపట్టారు.

అయితే గత ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డితో అవగాహనకు వచ్చినా అటు జమ్మలమడుగులోనూ విజయం దక్కలేదు. ఫలితాల తర్వాత ఆదినారాయ‌ణ రెడ్డిపై ఒత్తిడి పెరిగిపోయింది. కనీసం వర్గాన్ని రక్షించుకోవడానికైనా ఆయన బీజేపీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత‌లు ప‌లువురు హైదరాబాద్ లో మ‌కాం వేసి - అత్యంత రహస్యంగా సమావేశాలు జరుపుతున్నారు.

ఈ మేర‌కు శనివారం సాయంత్రం ఓ కీలక నేత ఇంట్లో జరిగిన సమావేశానికి రామ్‌ మాధవ్ హాజరైనట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన విధానం… మూడు నెలల్లోనే.. ఏపీ సర్కార్ తీరుపై.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను.. ఎలా అనుకూలంగా మార్చుకోవాలన్న అంశంపై చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో చేరికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రామ్‌ మాధవ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశార‌ని తెలుస్తోంది.

రామ్‌ మాధవ్ చెప్పిన అంశాలతో.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో కీలక నేతలు మ‌రోమారు సమావేశమయ్యారు. సుజనాచౌదరి - సీఎం రమేష్‌ - టీజీ వెంకటేశ్‌ - పురందేశ్వరి - మాణిక్యాలరావు - సోము వీర్రాజు - సత్యమూర్తితో పాటు పలువురు సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఏపీలో బ‌ల‌ప‌డేందుకు ఓ భారీ ప్రణాళికను అమలు చేయడానికి క‌మ‌ల‌నాథులు తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.