Begin typing your search above and press return to search.

ఆదీ.. ఈ భుజాలు త‌డుముకోవ‌డ‌మేంటీ?

By:  Tupaki Desk   |   16 April 2017 4:36 AM GMT
ఆదీ.. ఈ భుజాలు త‌డుముకోవ‌డ‌మేంటీ?
X
త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో మ‌రింత బ‌లం పెంచుకునే దిశ‌గా చిక్కిన ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారం చంద్ర‌బాబునాయుడు వ‌ద‌ల‌డం లేదు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఒక్క స్థానం మిన‌హా మిగిలిన అసెంబ్లీ స్థానాతో పాటు రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా జ‌గ‌న్ గెలుచుకుని త‌న సొంత జిల్లాలో త‌న ప‌ట్టు ఎంత‌గా ఉందో చాటి చెప్పేశారు. అయితే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట పార్టీ ఫిరాయింపుల‌కు తెర తీసిన అధికార ప‌క్షం... వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసింది. ఈ క్ర‌మంలో వైఎస్ ఫ్యామిలీ చ‌ల‌వ‌తో అసెంబ్లీలో అడుగుపెట్టిన జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యే చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి కూడా టీడీపీ వ‌ల‌కు చిక్కిపోయారు. జ‌గ‌న్‌ ను మ‌రింత బ‌ల‌హీనం చేసేందుకు జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌న్న భావ‌న‌తో ముందుకు సాగిన చంద్రబాబు... ఆదినారాయ‌ణ‌రెడ్డికి త‌న కేబినెట్‌ లో చోటిచ్చారు.

ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ఆదికి మార్కెటింగ్ శాఖ బాధ్య‌త‌లు ద‌ఖ‌లు ప‌డ్డాయి. ఈ శాఖ‌కు సంబంధించి గతంలో వెలుగుచూసిన ఓ భారీ కుంభ‌కోణం రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణ‌కు కూడా పాకింది. మొత్తం రూ.650 కోట్ల‌కు పైగా నిధుల‌ను కాజేసిన అధికారులు ద‌ర్జాగా ఉద్యోగం వెల‌గ‌బెడుతున్న వైనంపై టీడీపీ అనుకూల మీడియానే పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు రాసింది. అంత‌కుముందే ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు చేపట్టింది. అదే స‌మ‌యంలో విజిలెన్స్ శాఖ కూడా త‌న వంతుగా ద‌ర్యాప్తు చేపట్టింది. ఈ కుంభ‌కోణంలో 90 మందికి పైగా నిందితులు దోషులుగా తేల‌గా... మొద‌టి విడ‌త‌లో 26 మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. వీరంతా ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో తిరిగి చేర‌దామా? అంటూ కాసుక్కూర్చున్నారు. వారికి ఆదినారాయ‌ణ‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.

మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజే... ఈ 26 మందిపై కొన‌సాగుతున్న స‌స్పెన్ష‌న్‌ ను ఎత్తివేస్తూ ఆది సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మ‌రునాడే మొత్తం 26 మంది ఉద్యోగులు విధుల్లో చేరిపోయారు. ఈ వ్యవ‌హారంపై కాస్తంత అవగాహ‌న ఉన్న వారు... మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే ఆది త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుని, రైతుల‌ను న‌ట్టేట ముంచిన అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఓ రోజంతా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డ ఆదినారాయ‌ణ‌రెడ్డి... నిన్న మీడియా ముందుకు వ‌చ్చారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేత విష‌యంలో తాను త‌ప్పు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. తాను త‌ప్పు చేసిన‌ట్లు తేలితే... ఎంత‌టి శిక్ష‌కూనా కూడా సిద్ధ‌మేన‌ని కూడా ఆయ‌న విమ‌ర్శ‌కుల‌కు స‌వాల్ విసిరారు.

అయినా... వేలాది మంది రైతుల‌ను న‌ట్టేట ముంచిన అక్ర‌మార్కుల‌కు బాధ్య‌త‌లు స్వీక‌రించిన రోజే ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌రోమారు ప‌రిశీలించుకోవాల్సింది పోయి... త‌న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్న వారిపై అంతెత్తున ఎగిరిప‌డ‌టం ఎందుక‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా తాను త‌ప్పు చేసి ఉంటే... ఎంత‌టి శిక్ష‌కైనా సిద్ధ‌మంటూ ఆది చేసిన వ్యాఖ్య‌ల‌పైనా మ‌రింతగా విమ‌ర్శ‌లు రేకెత్తే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌నా విన‌బ‌డుతోంది. మ‌రి తొలి రోజే వేసిన ఈ త‌ప్ప‌ట‌డుగు నుంచి ఆది ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/