Begin typing your search above and press return to search.

చిరంజీవికి అంత సీనుందా..అద్దేపల్లీ..ఏందీ లొల్లి?

By:  Tupaki Desk   |   29 Jan 2019 1:30 AM GMT
చిరంజీవికి అంత సీనుందా..అద్దేపల్లీ..ఏందీ లొల్లి?
X
తెలుగు సినీ తెరపై ఓ వెలుగు వెలిగి.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అభిమానులతో అన్నయ్య అని పిలిపించుకున్న ఏకైక హీరో చిరంజీవి. సినీ రంగంలో ‘స్వయం కృషి’తో ఎదిగిన వ్యక్తిగా చిరుకు మంచి పేరుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. తన సినిమాలు చూసి విజిల్స్ వేసే జనాలను నమ్మి ‘ప్రజారాజ్యం’ అనే పార్టీని పెట్టి.. ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో కాంగ్రెస్‌ లో విలీనం చేసి.. విమర్శలు మూటగట్టుకున్న వ్యక్తి కూడా చిరంజీవే. ఇది నాణేనికి మరోవైపు. సినీ రంగంలో ఆయనో ‘విజేత’ అయినప్పటికీ రాజకీయ రంగంలో మాత్రం పరాజితుడిగా మిగిలిపోయిన చిరంజీవి గురించి తాజాగా ఓ వార్త హల్‌ చల్ చేస్తోంది. ఓ న్యూస్ చానల్ డిబేట్‌ లో జనసేన పార్టీ నేత అద్దేపల్లి శ్రీధర్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారాయి.

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిరంజీవి కోసం ప్రధాన పార్టీలన్నీ వెంపర్లాడుతున్నాయని - ఆయనను మభ్యపెట్టాలని చూస్తున్నాయని అద్దేపల్లి శ్రీధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. బీజేపీ - కాంగ్రెస్ - వైసీపీ - టీడీపీ పార్టీలు చిరంజీవిని తమ వైపు తిప్పుకునేందుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నాయని - మరెన్నో ఇస్తామని మభ్యపెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగైదు నెలలుగా ఈ పార్టీలన్నీ చిరంజీవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయని, కానీ చిరు ‘నో’ చెప్పారని అద్దేపల్లి శ్రీధర్ చెప్పుకొచ్చారు. జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఇప్పటికే రాజకీయంగా అట్టర్ ఫ్లాప్ అయిన వ్యక్తి అని - ఆయనను నమ్మి ఓట్లేసే జనం కూడా ఉన్నారా అనే సందేహం వ్యక్తమవుతోంది.

అంతేకాకుండా, చిరంజీవి అభిమానుల్లో చాలామంది ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ వెంట నడుస్తున్నారు. పవన్‌ ను కాదని.. వేరే పార్టీలకు ఓటేయమని చిరంజీవి చెప్పే అవకాశం కూడా లేదని.. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా చిరు కోసం ఎందుకు వెంపర్లాడుతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా, అద్దేపల్లి మాట్లాడుతూ.. ఆఫర్ చేసిన పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉందని చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని.. చిరంజీవికి రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగిసినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్‌ లోనే కొనసాగుతున్నారు. పార్టీకి రాజీనామా చేయలేదు. అలాంటప్పుడు చిరంజీవి కోసం కాంగ్రెస్ ఆఫర్ చేయాల్సిన అవసరం ఏముందనేది వాదన కూడా వినిపిస్తోంది. పైగా.. చిరంజీవికి కాంగ్రెస్ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం తెలంగాణ ఎన్నికలతో స్పష్టమైందన్న వాదన కూడా ఉంది. విజయశాంతిని సైతం ప్రచారంలో దించిన కాంగ్రెస్ చిరును లైట్ తీసుకుందంటే ఆయన స్థాయేంటో చెప్పొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా.. చిరంజీవి కుమారుడు రాంచరణ్ - చిరు తమ్ముడు నాగబాబు.. అతని కుటుంబమంతా పవన్ కోసం పనిచేస్తుంటే చిరు ఒక్కడే వేరే పార్టీలో చేరుతారనుకోవడం కూడా విడ్డూరమవుతుందనేది మరో వాదన.

రాజకీయంగా అట్టర్ ఫ్లాప్ అయిన చిరు కోసం ఇన్ని పార్టీలు ఆఫర్ చేస్తున్నాయంటే నమ్మశక్యం కావడం లేదని కొందరు నెటిజన్లు బాహాటంగానే చెబుతున్నారు. ఒకవేళ కాపు ఓటు బ్యాంకు కోసం చిరును పార్టీల్లో చేర్చుకోవాలని భావిస్తున్నా.. పవన్‌ను కాదని చిరు చెప్పిన పార్టీకి ఓట్లేసేందుకు కాపులు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నకూ ప్రస్తుతం సమాధానం దొరకని పరిస్థితి. ఇలా ఏ విధంగా చూసుకున్నా అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, జనసేన వ్యూహంలో భాగంగానే అద్దేపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొన్నికొన్ని సార్లు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు.. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రకటనలు చేయడం సహజమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నయ్య చిరంజీవి తమ్ముడితోనే ఉన్నారని పరోక్షంగా చెప్పడమే కాకుండా ఇతర పార్టీల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు ఇదొక ఎత్తుగడ అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చిరంజీవి ఒకవేళ జనసేనలో చేరకపోయినా.. కాంగ్రెస్‌లో ఉంటూనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ మౌనం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.