Begin typing your search above and press return to search.

విశాఖ ఏజెన్సీలో జగన్‌ కు సరైనోడు దొరికాడు

By:  Tupaki Desk   |   3 Aug 2018 3:01 PM GMT
విశాఖ ఏజెన్సీలో జగన్‌ కు సరైనోడు దొరికాడు
X
విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తన హవా చూపించింది. పార్లమెంటు స్థానంతో పాటు పాడేరు - అరకు - మాడుగుల అసెంబ్లీ సీట్లనూ తన ఖాతాలో వేసుకుంది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆడిన ఫిరాయింపుల ఆటలో అరకు - పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు - గిడ్డి ఈశ్వరిలు టీడీపీలో చేరిపోయారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైసీపీకి దూరమయ్యారు. దీంతో విశాఖ ఏజెన్సీలో వైసీపీకి మంచి పట్టున్నప్పటికీ సరైన బలమైన అభ్యర్థులు లేనట్లయింది. చాలాకాలంగా జగన్ కూడా ఇక్కడ సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నారు. ఆయన సెర్చ్ దాదాపు కొలిక్కి వచ్చినట్లు వినిపిస్తోంది. ఆంధ్రయూనివర్సిటీ మెడికల్ కాలేజిలో సీనియర్ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న డాక్టర్ అడపా రామకృష్ణ నాయుడిని పాడేరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్న సమాచారం. పాడేరుకే చెందిన ఆయన కేజీహెచ్‌ లో రుమటాలజీ విభాగంలో వైద్యుడిగా ఉన్నారు.. పాడేరు - అరకు నియోజకవర్గాలు రెండింట్లోనూ రామకృష్ణ నాయుడుకి మంచి పేరుంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రెండు నియోజవకర్గాలకూ పరిశీలించొచ్చని వైసీపీ విశాఖ నేతలు జగన్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అవసరమైతే అరకు పార్లమెంటు స్థానానికి కూడా ఆయన అభ్యర్థి కాగలరని అంటున్నారు. యువకుడు - పేరున్న వైద్యుడు - నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి కావడంతో విశాఖ ఏజెన్సీలో అడపా రామకృష్ణనాయుడు సరైన అభ్యర్థి కాగలరని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో రామకృష్ణం నాయుడికి మంచి పట్టుంది. డాక్టర్ రామకృష్ణ నాయుడి తండ్రి బొంజు నాయడు ఇప్పటికే వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర కన్వీనర్‌ గా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి తరఫున ప్రచారం చేసి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. పైగా సిటింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిది - వీరిది గిరిజనుల్లో ఒకే సామాజిక వర్గం కావడంతో ఆ వర్గం ఓట్లు గిడ్డి ఈశ్వరికి పోకుండా అడ్డుకోవచ్చన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

మరోవైపు ఇప్పటికే తండ్రితో కలిసి రామకృష్ణ నాయుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అలాగే... వైద్యుడైన ఆయన ఈ ప్రాంతం నుంచి విశాఖకు వైద్యం కోసం వచ్చేవారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ అన్ని సమీకరణాలు కలిపి డాక్టర్ రామకృష్ణ నాయుడైతేనే వైసీపీని ఈ ఎన్నికల్లోనూ ఏజెన్సీలో గెలిపించగలరని భావిస్తున్నారు.