Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానంలో అదానీ

By:  Tupaki Desk   |   13 April 2022 3:34 AM GMT
ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానంలో అదానీ
X
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ వ్యాపారదిగ్గజం అదానీ ఎగబాకారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ టాప్ 10 బిలియనీర్ల జాబితాలో అదానీ గ్రూప్ వ్యవస్థాపక అధినేత గౌతమ్ అదానీ ఆరోస్థానం దక్కించుకున్నారు. 97 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ 11వ స్థానంలో ఉండగా.. అదానీ సంపద 118 బిలియన్ డాలర్లు (దాదాపు 9 లక్షల కోట్లు)గా తేలింది.

ఒక్క వారంలోనే 18 బిలియన్ డాలర్లు పెరగడంతో గూగుల్ వ్యవస్థాపకులు లర్రీ పేజ్, సర్గే బ్రిన్ లనూ దాటేసిపోయారు. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవడమే గాక.. టాప్ 10 లో ఉన్న ఏకైక భారతీయ వ్యక్తి అదానీయే అయినట్టు అయ్యింది. ఏడాది క్రితం కేవలం 57 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న అదానీ.. ఈనెల 4న 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి తొలిసారిగా ప్రవేశించారు.

దీంతో ముకేష్ అంబానీని వెనక్కినెట్టి అటు భారత్, ఇటు ఆసియా కుబేరుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా.. అదానీ గ్రూప్ లో 7 సంస్తలు స్టాక్ మార్కెట్లలో ఉండగా.. వీటి మొత్తం మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లపైనే.. స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ, ఇతరత్రా అంశాల ప్రామాణికంగానే వ్యక్తిగత సంపదను బ్లూంబర్గ్ లెక్కిస్తుందన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ జాబితాలో 249 బిలియన్ డాలర్లతో టెస్లాకు చెందిన ఎలన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జెఫ్ బెజోస్ 176 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ అర్నాల్డ్ 139 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 130 బిలియన్ డాలర్లు , వారెన్ బఫెట్ 127 బిలియన్ డాలర్లు తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.