Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో ఆదానీ జట్టు ఖాయమట.. రెండోది ఎవరికి?

By:  Tupaki Desk   |   6 July 2021 1:30 PM GMT
ఐపీఎల్ లో ఆదానీ జట్టు ఖాయమట.. రెండోది ఎవరికి?
X
దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. క్రికెట్ లో కీలకమైన భావోద్వేగం అన్నదే లేని ఈ టోర్నీ సక్సెస్ మీద ఉన్న సందేహాల్ని.. క్రికెట్ మీద ఉన్న అభిమానం అధిగమించిందని చెప్పాలి. ప్రాంతాల వారీగా జట్లు ఉన్నప్పటికీ..ఆ పరిమితుల చట్రంలోకి చిక్కుకోని క్రికెట్ ప్రేమికులు.. తమకు నచ్చిన సభ్యుడు ఉన్న జట్టును అభిమానించటం.. తమ ప్రాంతానికి చెందిన జట్టును ఆరాధించటం లాంటి పలు కారణాలతో ఐపీఎల్ ను సూపర్ హిట్ గా చేశారు. చాలామంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ లో ఒకటి కాకుండా రెండు జట్లను అభిమానించే చిత్రమైన అలవాటు కూడా కనిపిస్తుంది.

తొలుత ఉన్న జట్లకు తర్వాతి కాలంలో జత కలిసిన జట్ల తర్వాత.. తాజాగా రెండు జట్లను ఐపీఎల్ లోకి తీసుకోవాలని డిసైడ్ అయిన నేపథ్యంలో.. ఈ రెండు ఫ్రాంఛైజీలు ఏమై ఉంటాయి? వాటిని ఎవరు సొంతం చేసుకుంటారన్న దానిపై బోలెడంత చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్ కు కొత్త జట్లు టోర్నీకి సిద్ధం కానున్నాయి. ఆగస్టులో కొత్త జట్ల ఎంపిక కార్యక్రమం దాదాపుగా ఫైనల్ అవుతుందని చెబుతున్నారు.

కొత్తగా వచ్చే జట్లతో ఇప్పటివరకు జరుగుతున్న 60 మ్యాచ్ లకు బదులుగా 74 మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో.. క్రికెట్ ప్రేమికులు మరింత ఎంజాయ్ చేసే వీలు కలుగుతుంది. కొత్త ప్రాంఛైజీల్లో ఒక్కోదాని ధర రూ.2వేల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇక.. కొత్త ఫ్రాంఛైజీలు ఏమేం వస్తాయన్న దానికి సంబంధించి చూస్తే.. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. అహ్మాదాబాద్ జట్టు ఒకటి ఖాయంగా వస్తుందని చెబుతున్నారు. రెండో జట్టు విషయానికి వస్తే.. ఫుణె.. లక్నో.. కోచి లాంటి నగరాల పేర్లు రేసులో ఉన్నాయి. ఒకటి ఉత్తరాదికి ఇచ్చారు కాబట్టి.. రెండోది దక్షణాదికి ఇస్తారా? అన్న చర్చ కూడా ఉంది.

ఈ జట్లను సొంతం చేసుకునే వారి విషయానికి వస్తే.. ఆహ్మాదాబాద్ జట్టును దేశీయ శ్రీమంతుల్లో కీలకమైన ఆదానీ గ్రూప్ దీన్ని సొంతం చేసుకుందని చెబుతున్నారు. ఈ విషయంలో మరో ఆలోచన ఉండదని.. గుజరాత్ జట్టును వారు కాక మరెవరు యజమాని కాగలరు? అన్న మాట వినిపిస్తోంది. రెండో జట్టును సొంతం చేసుకోవటానికి పలువురు పోటీ పడుతున్నారు. వారిలో కోల్ కతాకు చెందిన గోయెంకా గ్రూపుతో పాటు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కానీ ఫార్మా కంపెనీ కానీ రేసులో ఉండొచ్చొంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.