Begin typing your search above and press return to search.

అదానీ పెను సంచలనం: ప్రపంచ కుబేరుల్లో నంబర్ 2కి చేరిక

By:  Tupaki Desk   |   16 Sep 2022 9:25 AM GMT
అదానీ పెను సంచలనం: ప్రపంచ కుబేరుల్లో నంబర్ 2కి చేరిక
X
ప్రధాని నరేంద్రమోడీ పాలనలో ఆయన జిగ్రీ దోస్త్.. తోటి గుజరాతీ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆస్తులు పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆదానీ ఆస్తులు పెరగడానికి మోడీ ప్రపంచవ్యాప్తంగా నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో కాకుండా అదానీ ఖాతాల్లో వేస్తున్నాడని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి. ఎందుకంటే దేశంలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీని మించి.. ప్రపంచంలోని టాప్ ధనవంతులను మించేస్తూ అదానీ సంపద ఒక్క ఏడాదిలోనే ఇంతింతై అన్నట్టుగా పెరిగిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను అధిగమించిన గౌతం అదానీ ప్రపంచంలోనే నంబర్ 2 ధనవంతుడిగా ఎదిగారు. అదానీ కంటే ముందు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు.

నికర సంపదలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ తాజాగా ప్రపంచ ధనవంతుల్లో రెండో స్థానానికి చేరి పెను సంచలనం సృష్టించారు. సంపద పరంగా ఆయన కంటే కేవలం ప్రపంచంలో నంబర్ 1 కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి కూడా అదానీయే.

స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అదానీ సంపద పెరిగి అమెరికన్ ధనవంతుల సంపద తరిగిపోయినట్టు సమాచారం.

ఫోర్బ్స్ వివరాల ప్రకారం.. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు శుక్రవారం లాభపడ్డాయి. దీంతో ఆయన సంపద విలువ 5.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. 155.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్తానానికి చేరారు.

ఇక విలాస వస్తువుల కంపెనీ 'ఎల్ .వీఎంహెచ్ అధినేత' బెర్నార్డ్ ఆర్నాల్డ్ 155.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ 149.7 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి చేరారు. భారత్ కు చెందిన మరో కుబేరుడు ముకేష్ అంబానీ ఈ జాబితాలో 92.3 బిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో నిలిచారు.

అదానీ గ్రూప్ లో మొత్తం 7 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల్లో ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 20.11 లక్షల కోట్లు. నాలుగు కంపెనీల షేర్ ధర ఈ కేలండర్ ఏడాదిలో రెండింతలకు పైగా పెరిగింది.

ప్రస్తుతం అదానీ పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకూ.. సిమెంట్ కంపెనీల నుంచి మీడియా వరకూ ప్రతీ వ్యాపారాన్ని ఆయన అందుకుంటున్న తీరే కార్పొరేట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎన్డీటీవీని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దేశమంతా ఇప్పుడు అదానీ మయం అవుతోంది. ఎక్కడ చూసినా అదానీ కంపెనీలే కనిపిస్తున్నాయి. ఉప్పు పప్పు నుంచి వంటనూనెల వరకూ.. విద్యుత్ రంగం నుంచి పోర్టుల వరకూ.. తాజాగా మీడియా రంగంలోనూ అదానీ రంగ ప్రవేశం చేశారు. మోడీ సర్కార్ పాలనలో ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఇంతలా పురోభివృద్ధి సాధించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

గౌతం అదానీ ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానానికి చేరుకున్నాడని ఇటీవలే బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ డేటా వెల్లడించింది. ఇప్పుడు ఫోర్బ్స్ 2వ స్థానానికి చేరుకున్నాడని నివేదించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.