Begin typing your search above and press return to search.

అదానీ మెడకు చుట్టుకోనున్న డ్రగ్స్ వ్యవహారం ?

By:  Tupaki Desk   |   30 Sep 2021 4:39 AM GMT
అదానీ మెడకు చుట్టుకోనున్న డ్రగ్స్ వ్యవహారం ?
X
గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న వేల కోట్ల రూపాయల హెరాయిన్ వ్యవహారం అదానీ గ్రూపు మెడకు చుట్టుకునేట్లే ఉంది. ముంద్రా పోర్టు నిర్వహణ అదానీ గ్రూపు చూసుకుంటోంది. ఎప్పుడైతే ముంద్రా పోర్టులో రు. 72 వేల కోట్ల విలువైన సుమారు 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడిందో వెంటనే ఏపిలో కూడా రాజకీయంగా ప్రకంపనలు మొదలైపోయాయి. ఎందుకంటే గుజరాత్ కు చేరుకున్న షిప్మెంట్ కార్గో లో హెరాయిన్ డెలవరీ అడ్రస్ వియవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ ఉండటమే.

పట్టుబడిన హెరాయిన్ నిజంగానే విజయవాడకు చేరుకునేదో లేదో తెలీదు కానీ దాని అడ్రస్ కారణంగా చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం ప్రభుత్వంపై పెద్దఎత్తున బురద చల్లేస్తున్నారు. హెరాయిన్ మొత్తం విజయవాడకే వస్తోందని ఏపిని జగన్మోహన్ రెడ్డి డ్రగ్ స్టేట్ గా మార్చేస్తున్నారంటు నానా గోలచేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే స్పెషల్ కోర్టు డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు ఇచ్చిన ఆదేశాలు కీలకంగా మారింది. ముంద్రా పోర్టును నిర్వహిస్తున్నది అదానీ గ్రూపు అయితే పోర్టు నిర్వహిస్తున్న కంపెనీకి తెలీకుండా ఎలాగుంటుందని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది.

పోర్టు ద్వారా జరిగే సరుకు వ్యాపారం కచ్చితంగా పోర్టును నిర్వహిస్తున్న ఆపరేటింగ్ సంస్ధకు తెలీకుండా జరిగే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది. పోర్టు ద్వారా జరిగే సరుకు లావాదేవీల్లో నిర్వహణ సంస్ధకు కూడా బాధ్యత ఉంటుంది కదాని కోర్టు డీఆర్ఐ ఉన్నతాధికారులను నిలదీసింది. ఇరాన్ నుండి వచ్చిన హెరాయిన్ నేరుగా చైన్నైకి కాకుండా విజయవాడకు చాలా దూరంలో ఉన్న గుజరాత్ ముంద్రా పోర్టులోనే ఎందుకు డెలవరీ చేయించుకున్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

ఒకవేళ సరుకును విజయవాడకు తరలించటమే స్మగ్లర్ల ఉద్దేశ్యమైతే విజయవాడకు దగ్గరలోనే ఉన్న ఇంకేదైనా పోర్టుకు డెలవరీ అడ్రస్ ఇస్తారు కానీ గుజరాత్ పోర్టుకు ఎందుకు తెప్పించుకుంటారన్న కోర్టు ప్రశ్నకు డీఆర్ఐ ఏమీ సమాధానం చెప్పలేదు. పోర్టును నిర్వహిస్తున్న అదానీ యాజమాన్యం కానీ లేదా అందులో పనిచేసే ఉన్నతాధికారులు, సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కంటైనర్ల స్కానింగ్, తరలింపు ప్రక్రియకు విదేశాల్లో అమలవుతున్న విధానాలేమిటి ? ఇక్కడ అదానీ గ్రూపు అనుసరిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని కోర్టు ఆదేశించింది.

ఇదే విషయమై అదానీ గ్రూపు స్పందించింది. పోర్టు నడపటమే తమ బాధ్యత కానీ అందులో సరుకు రాకపోకలతో తమకు ఎలాంటి సంబంధంలేదన్నది. తాము నిర్వహిస్తున్న పోర్టులోకి షిప్పుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పించటం మాత్రమే తమ పాత్రగా స్పష్టంచేసింది. తమ టెర్మినళ్ళ ద్వారా నడిచే కంటైనర్లు, లక్షలాది కార్గోల తనిఖీ అధికారాలు తమకు లేవన్నది. ఆ బాధ్యత పోర్టుల అథారిటిలది మాత్రమే అని కూడా అదాని గ్రూపు చెప్పింది. అయితే బాధ్యతల నుండి అదానీ గ్రూపు తప్పించుకోవటం అంత తేలిక కాదని అధికారవర్గాలు అంటున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.