Begin typing your search above and press return to search.

టాటాను వెనక్కి నెట్టేసిన అదానీ.. ఆ విషయంలో అతడే నెం.1

By:  Tupaki Desk   |   18 Sep 2022 7:30 AM GMT
టాటాను వెనక్కి నెట్టేసిన అదానీ.. ఆ విషయంలో అతడే నెం.1
X
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లిన అతి తక్కువ గ్రూపుల్లో అదానీ గ్రూప్ ఒకటని చెప్పాలి. రెండు రోజుల క్రితం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకొని.. అమెజాన్ అధిపతిని వెనక్కి నెట్టేసిన గౌతమ్ అదానీ దూకుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా దేశంలో అత్యంత విలువైన వ్యాపార గ్రూపుల జాబితాలో టాటాను వెనక్కి నెట్టేశారు. ఆ స్థానంలోకి అదానీ గ్రూప్ వచ్చేసింది. దీంతో.. దేశంలో అత్యంత విలువైన వ్యాపార గ్రూపుగా అదానీ గ్రూప్ అవతరించింది.

హోల్సిమ్ నుంచి కొనుగోలు చేసిన ఏసీసీ.. అంబుజా సిమెంట్స్ సహా అదానీ గ్రూప్ పరిధిలోకి 9 లిస్టెట్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22.25 లక్షల కోట్లకు (శుక్రవారం నాటికి) చేరుకోవటం ద్వారా 27 లిస్టెట్ కంపెనీలతో రూ.20.81 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉన్న టాటా గ్రూప్ ను అధిగమించింది. ఇక.. మూడో స్థానంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. తాజాగా ఏసీసీ.. అంబుజా సిమెంట్స్ కొనుగోలు పూర్తి అయినట్లుగా అదానీ గ్రూప్ ప్రకటించింది.

ఈ రెండు కంపెనీలను మినహాయించినా.. గ్రూపు మార్కెట్ క్యాప్ ఈ ఏడాది రూ.10 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అదే సమయంలో టాటా గ్రూప్ రూ.2.57 లక్షల కోట్ల మార్కెట్ సంపదను కోల్పోయింది. దీనికి కారణం ఆ గ్రూప్ మార్కెట్ క్యాప్ లో సగానికి పైగా వాటా ఉన్న టీసీఎస్ షేర్లు ఈ ఏడాది 17 శాతానికి క్షీణించటమే. అయితే.. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రూ.16.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబరు 1 స్థానంలో నిలచింది.

ఈ అంశంలో రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా ఉండగా.. అదానీ గ్రూప్ లో అత్యంత విలువైన కంపెనీ అదానీ ట్రాన్స్ మిషన్.. దాని మార్కెట్ క్యాప్ రూ.4.57 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. అదానీ పవర్ షేరు 3.9 రెట్లు.. అదానీ ట్రాన్స్ మిషన్ 2.4 రెట్లు పెరిగాయి. మరో నాలుగు కంపెనీలు కూడా రెట్టింపు కావటంతో ఇప్పుడున్న పరిస్థితికి చేరుకున్నట్లైంది. మొత్తంగా చూస్తే.. సమీప దూరంలో అదానీ దూకుడు తగ్గే పరిస్థితి కనిపించటం లేదని చెప్పాలి.