Begin typing your search above and press return to search.

2019 మోడీదేనని తేల్చేసిన అమెరికా నిపుణులు

By:  Tupaki Desk   |   14 March 2017 10:34 AM GMT
2019 మోడీదేనని తేల్చేసిన అమెరికా నిపుణులు
X
చాలా అరుదుగా జరిగే పరిణామంగా చెప్పొచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం అంచనా వేయలేని రాజకీయాల్లో.. దాదాపు రెండేళ్ల తర్వాతేం జరుగుతుందన్న విషయాన్ని అంచనా కట్టటం కాస్తంత కష్టమైన పనే. కానీ.. ఇప్పడేమాత్రం కష్టం కాదని చెప్పేస్తున్నారు అమెరికా నిపుణులు. తాజాగా వెలువడిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నవిషయాన్ని చెప్పేస్తున్నారు.

2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు విజయం సాధిస్తుందని.. ఆ విషయంలో మరో మాట లేదని పలువురు నిపుణులు జోస్యం చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ.. మోడీ ప్రత్యర్థులు 2019 ఎన్నికల గురించి ఆలోచించటం మానేయాలని ఆ తర్వాత వచ్చే 2024 ఎన్నిలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని.. ఆ దిశగా పనులు ప్రారంభించాలని చెప్పటం తెలిసిందే.

ఇప్పుడు అదే విషయాన్ని అమెరికాకు చెందిన పలువురు నిపుణులు చెబుతున్నారు. భారత రాజకీయ వ్యవహారాల్నివిశ్లేషించే నిపుణులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ.. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంత సామాన్యమైనవి కాదని.. 2014 ఎన్నికల ఫలితాల ప్రభావం ఎన్నికల వరకూ కొనసాగినట్లుగా పేర్కొన్నారు.

జార్జ్ వాషింగ్టన్ వర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ వ్యవహారాల్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ ఆడమ్ జిగ్ ఫెల్డ్ మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కూడామోడీ హవా నడుస్తుందన్న అంచనా వేశారు. గతంలో యూపీలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేతలు సాధించిన విజయంతో పోల్చినా.. తాజా గెలుపు చక్కటి గెలుపుగా అభివర్ణించారు. ఇదే వాదనను సదానంద్ ధూమే అనే నిపుణుడు కూడా వ్యక్తం చేశారు. ఒకవేళ మోడీకి అనుకున్నంత మెజార్టీ రాకున్నా.. కేంద్రంలో అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఇక..ప్రొఫెసర్ ఇర్ఫాన్ నూరుద్దీన్ అనే నిపుణుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. 2019ఎన్నికల్లో ప్రభుత్వవ్యతిరేక పవనాలు కొద్దిగా పడినా..అంతిమంగా విజయం మాత్రం మోడీదేనని వెల్లడించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/