Begin typing your search above and press return to search.

మీ విధానాల వ‌ల్లే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేదు.. ఏపీ మంత్రిపై హీరోయిన్ హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   18 Sep 2022 10:30 AM GMT
మీ విధానాల వ‌ల్లే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేదు.. ఏపీ మంత్రిపై హీరోయిన్ హాట్ కామెంట్స్‌!
X
రాజకీయ పార్టీల మ‌ధ్య విభేదాల వ‌ల్లే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేద‌ని ప్ర‌ముఖ సినీ న‌టి పూన‌మ్ కౌర్ అన్నారు. సౌత్ ఫ‌స్ట్.. ద‌క్షిణ్ డైలాగ్స్ 2022 కాంక్లేవ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్ రాజ‌న్‌, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప్ర‌ముఖ సినీ న‌టి పూన‌మ్ కౌర్ హాట్ కామెంట్స్ చేశారు. సౌత్ ఫస్ట్ దక్షిణ్ డైలాగ్స్ 2022 కాన్క్లేవ్‌లో దేశాభివృద్ధిలో ద‌క్షిణ భార‌త రాష్ట్రాల పాత్ర‌, 'ప్రత్యేక హోదా' అంశం చర్చకు వచ్చాయి. అయితే ఊహించ‌ని విధంగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కి నటి పూనమ్‌ కౌర్‌ ఈ ప్రశ్న వేశారు.రాజకీయ విభేదాల వల్లే ‘ప్రత్యేక హోదా’ రాలేదా అని  పూనమ్ కౌర్ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ను ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధాన‌మిచ్చిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించిన‌ప్పుడే ‘ప్రత్యేక హోదా’ ఇచ్చి ఉండాల్సింద‌ని తెలిపారు.

2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం తీసుకొచ్చిన వెంటనే ‘ప్రత్యేక హోదా’ మంజూరు చేయాల్సి ఉంది. దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉందంటే.. ఎప్ప‌టికీ లక్ష్యాన్ని చేరుకోలేం.. అని బుగ్గ‌న.. పూన‌మ్ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. దీంతో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య విభేదాల‌తోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాలేద‌ని హాట్ కామెంట్స్ చేశారు.

కాగా హైద‌రాబాద్‌ను కోల్పోయిన విభ‌జిత‌ ఆంధ్రప్రదేశ్‌కి ప్ర‌త్యేక హోదా జీవ‌నాధారం. తాము ఢిల్లీ వెళ్లిన‌ప్పుడ‌ల్లా ప్ర‌త్యేక హోదా కోసం అడుగుతూనే ఉండ‌టం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ చెబుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు 20కి పార్ల‌మెంటు స్థానాల‌ను త‌న‌కిస్తే ప్ర‌త్యేక హోదా తెస్తాన‌న్న జ‌గ‌న్ ఇప్పుడు క‌ల్లిబొల్లి మాట‌లు చెప్ప‌డం దారుణ‌మ‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

అలాగే రాష్ట్రాల‌కు కేంద్రం స‌హ‌కారం ఎలా ఉంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను పూన‌మ్ కౌర్ ప్ర‌శ్న అడిగారు. మంచి పనితీరుతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోందని కేటీఆర్ మండిప‌డ్డారు. భారత్ లాంటి సమాఖ్య వ్యవస్థలో ఇది మంచిది కాదని ఆయ‌న బదులిచ్చారు.