Begin typing your search above and press return to search.

ఆ మంత్రిని అడ్డంగా బుక్ చేసిన నటి.. రూ.20 కోట్లు ఆయనవే!.

By:  Tupaki Desk   |   26 July 2022 4:51 AM GMT
ఆ మంత్రిని అడ్డంగా బుక్ చేసిన నటి.. రూ.20 కోట్లు ఆయనవే!.
X
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే నేతలు చాలా అప్రమత్తంగా ఉంటారు. అందులోనూ వయసులో కాస్త పెద్ద అయ్యాక ఇది మరింత పెరుగుతుంది. అందుకు భిన్నంగా వ్యవహరించేవారు ఏదో ఒక ఇష్యూలో అడ్డంగా బుక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన పలు ఉదంతాలు గతంలో చోటు చేసుకున్నాయి.

తాజాగా పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూలో.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. మంత్రిగారి పని అయిపోయినట్లేనన్న మాట వినిపిస్తోంది. ఇందుకు ఒక కుర్ర నటి కారణమని చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.

సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న బెంగాలీ నటిగా అర్పిత ముఖర్జీకు మంచి పేరుంది. వేసేది సహాయక పాత్రలే అయినా.. ఆమెకున్న ఇమేజ్ మాత్రం అందుకు భిన్నంగా చెబుతుంటారు. బెంగాలీ సూపర్ స్టార్ల సినిమాల్లో తళుక్కుమన్న ఆమెను అందరూ ఇట్టే గుర్తిస్తుంటారు. అంతేనా..69 ఏళ్ల పెద్ద వయసున్న బెంగాల్ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీకి ఆమె అత్యంత సన్నిహితురాలిగా చెబుతుంటారు.

ఇప్పటికే టీఎంసీ సర్కారు మీద గురి పెట్టిన మోడీ సర్కారుకు తగ్గట్లే.. ఈడీ ఇతర విచారణ సంస్థలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని ఎదురుచూసిన దానికి తగ్గట్లే.. వారికి బంఫర్ ఆఫర్ లభించినట్లేనని చెబుతున్నారు. అర్పితా ముఖర్జీ నివాసంపై శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించటం.. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో రూ.20 కోట్ల నగదు బయటపడటం షాకింగ్ గా మారింది.

ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ప్రశ్నిస్తున్నారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లు.. బోధనేతర సిబ్బంది నియామకాల్లో స్కాం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాల్ని ఈడీ సేకరించినట్లేనని చెబుతున్నారు. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అసలు ఆమెకు.. పార్థ ఛటర్జీకు ఎలా పరిచయం జరిగింది? .అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఈడీ విచారణలో కీలకమైన అంశాలు ఆమె నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.

అన్నింటికి మించి.. తనిఖీల్లో భాగంగా ఆమె ఇంట్లో లభించిన రూ.20 కోట్ల నగదు మొత్తం విద్యా మంత్రిగా వ్యవహరిస్తున్న పార్థా చటర్జీకి సంబంధించినవే అన్న విషయాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు. తన ఇంట్లో లభించిన గుట్టల కొద్దీ నోట్ల కట్టల్నిస్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులకు ఆమె వాంగ్మూలం ఇస్తూ.. భారీ మొత్తం మంత్రిదేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలతో అరెస్టు అయిన మంత్రికి.. అర్పితా ఇచ్చిన తాజా వాంగ్మూలం భారీ దెబ్బగా భావిస్తున్నారు. తాజా పరిణామంతో ఆయన పని అయిపోయినట్లుగా అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.