Begin typing your search above and press return to search.

టీడీపీకి ఐటీ గ్రిడ్‌!... టీఆర్ ఎస్‌ కు ఎస్సార్‌ డీహెచ్‌!

By:  Tupaki Desk   |   8 March 2019 2:19 PM GMT
టీడీపీకి ఐటీ గ్రిడ్‌!... టీఆర్ ఎస్‌ కు ఎస్సార్‌ డీహెచ్‌!
X
ఇప్పుడు ఎక్క‌డ చూసినా డేటా చోరీకి సంబంధించిన అంశంపైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా ఇదే ప‌రిస్థితి. ఏపీ ప్ర‌జ‌ల డేటాను త‌స్క‌రించేసిన ఏపీలోని అధికార పార్టీ టీడీపీ... ఎన్నిక‌ల్లో త‌న‌కు అనుకూల‌మైన వారి ఓట్ల‌ను ముట్టుకోకుండా... ఓటేయ‌న‌ని వారి ఓట్ల‌ను మాత్రం తీసేయిస్తోంద‌న్న‌ది ఈ వ్య‌వ‌హారంలో కీల‌క ఆరోప‌ణ‌. వైసీపీ చేసిన ఫిర్యాదుపై ఇప్ప‌టికే తెలంగాణ పోలీసులు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను రంగంలోకి దించారు. కేసీఆర్ స‌ర్కారు ఆదేశాల మేర‌కు ఈ సిట్ కూడా ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయింది. ఇలాంటి కీల‌క త‌రుణంలో టీడీపీకి అనుకూలంగా వ్య‌వహ‌రిస్తున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు - ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం కోసం పోరాటం చేసిన శివాజీ తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దేశంలోని దాదాపుగా అన్ని పార్టీలు కూడా ప్ర‌జ‌ల స‌మాచారాన్ని సేక‌రించి ఈ త‌ర‌హా కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని చెప్పుకొచ్చిన శివాజీ... ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ‌లో అదికార పార్టీ కూడా మిన‌హాయింపేమీ కాద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టీఆర్ ఎస్ ప్ర‌జ‌ల డేటాను చోరీ చేసింద‌ని ఆరోపించిన ఆయ‌న‌... అందుకు త‌గ్గ ఆధారాలు కూడా త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని మ‌రో బాంబు పేల్చారు. ఈ ఆధారాల‌ను తాను ఎక్కడి నుంచో సేక‌రించ‌లేద‌ని - కేంద్ర ఎన్నిక‌ల సంఘం ద్వారానే తాను ఈ ఆధారాల‌ను సేక‌రించాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌మాచార హక్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న తాను... టీఆర్ ఎస్ డేటా చోరీకి సంబంధించిన నిజాల‌ను వెలికి తీశాన‌ని శివాజీ చెప్పారు. శివాజీ వినిపిస్తున్న క‌థ‌నం ప్ర‌కారం... ఏపీ ప్ర‌జ‌ల డేటా చోరీ చేసేందుకు టీడీపీకి ఐటీ గ్రిడ్ ఎలా అయితే స‌హ‌క‌రించిందో.... అదే రీతిన టీఆర్ ఎస్ కు స్టేట్ రెసిడెంట్ డేటా హ‌బ్ (ఎస్సార్‌ డీహెచ్‌) అనే సంస్థ ప‌నిచేసింద‌ట‌.

మొన్నటి ఎన్నిక‌ల ముందు వ‌రకు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వ‌హించిన ఐటీ శాఖే ఈ సంస్థ‌ను ఏర్పాటు చేసింద‌ట‌. ఈ సంస్థ ఏర్పాటులో ఐటీ మంత్రిత్వ శాఖ‌కు ఏ మేర పాత్ర ఉందో - తెలంగాణ పోలీసుల‌కు కూడా అంతే పాత్ర ఉంద‌ట‌. ఈ సంస్థ ద్వారా టీఆర్ఎస్ ప్ర‌జ‌ల డేటాను ఎలా చోరీ చేసింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ఉన్న ఓట‌రు జాబితాను కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే (ఇంటిగ్రేటెడ్ హౌస్‌ హోల్డ్ స‌ర్వే) ద్వారా సేక‌రించిన డేటాను అనుసంధానం చేసి డేటా చోరీకి పాల్ప‌డ్డార‌ట‌. ఈ రెండు వివ‌రాల‌ను క్రోడీక‌రించిన త‌ర్వాతే... మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముందు అనుకూలంగా ఉండే ఓట్ల‌ను ముట్టుకోని టీఆర్ ఎస్‌....త‌న‌కు ఓటేయర‌ని భావించిన వారి ఓట్ల‌ను జాబితా నుంచి తొల‌గించేసిందట‌. ఐటీ గ్రిడ్ త‌ర‌హాలోనే ఈ వ్య‌వ‌హారం కూడా న‌డిచింద‌ట‌. పై రెండు మార్గాల ద్వారా సేక‌రించిన వివ‌రాల‌ను ఓ ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించిన టీఆర్ ఎస్‌... ఆ సంస్థ ఇచ్చిన స‌మాచారంతోనే ఓట్ల తొల‌గింపుకు శ్రీ‌కారం చుట్టింద‌ట‌.

ఇక ఈ త‌ర‌హా డేటా చోరీకి టీఆర్ ఎస్ ఒక్క‌టే పాల్ప‌డ‌టం లేద‌ని ఆరోపించిన శివాజీ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ త‌ర‌హా జిమ్మిక్కుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. అస‌లు విష‌యం చెప్పాలంటే.... దేశంలోని అన్ని పార్టీలూ ఈ త‌ర‌హా చోరీకి పాల్ప‌డుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. తాను ఎన్నిక‌ల సంఘం నుంచి త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను సేక‌రిస్తే... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కూడా ఇదే రీతిన పోరాటం చేస్తున్నార‌ని కూడా శివాజీ చెప్పారు. డేటా చోరీపై న‌మోదైన కేసు ద్వారా ఒక్క టీడీపీనే ఈ త‌ర‌హా అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌న్న విశ్లేష‌ణ‌ల‌ను బ‌ద్ద‌లు కొడుతూ... దేశంలోని ఏ ఒక్క పార్టీ కూడా ఇందుకు మిన‌హాయింపు కాద‌ని ఆరోపించిన శివాజీ... నిజంగానే సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించార‌ని చెప్పాలి.