Begin typing your search above and press return to search.

మంచి చేస్తున్నారు కాబట్టే విమర్శలు: జగన్‌ను కలిసిన నటుడు అలీ

By:  Tupaki Desk   |   16 Sept 2020 11:04 PM IST
మంచి చేస్తున్నారు కాబట్టే విమర్శలు: జగన్‌ను కలిసిన నటుడు అలీ
X
ప్రముఖ సినీ నటుడు అలీ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. జగన్ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మా నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా పరిశ్రమ గురించి వాకబు చేశారన్నారు. వైరస్ నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది.

ఈ మహమ్మారి నేపథ్యంలో షూటింగ్స్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని తాను అధినేతకు చెప్పానని అన్నారు. చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన జగన్, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ప్రజల ఆదరణను చూరగొంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వరుసగా నెరవేరుస్తున్నారని చెప్పారు. ఆయనపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ... మంచి పనులు చేసినప్పుడు విమర్శలు చేసేవారు ఉండటం సహజమే అన్నారు.

వారు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయలేకపోయారని, కాబట్టి ఈయనకు మంచి పేరు వస్తుందనే కోపంతో విమర్శలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్ దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడటం ఖాయమని చెప్పారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం, వైసీపీ నేతలను కలిసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ వైపు నిలబడ్డారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం కూడా చేసారు.