Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడుపై క‌ర్ణాట‌క‌లో ర‌చ్చ ర‌చ్చ

By:  Tupaki Desk   |   6 Sep 2016 9:44 AM GMT
త‌మిళ‌నాడుపై క‌ర్ణాట‌క‌లో ర‌చ్చ ర‌చ్చ
X
నీటి యుద్ధాలు జ‌రుగుతాయ‌ని అప్ప‌ట్లో అబ్దుల్ క‌లాం చెప్పిన‌ప్పుడు చాలామంది లైట్ తీసుకున్నారు. కొన్నేళ్లుగా వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు చూసిన‌ప్పుడు నీటి యుద్ధాలు మ‌రెంతో దూరంలోనే లేవ‌నే అభిప్రాయానికి వ‌స్తున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడుల‌ మ‌ధ్య నీటి పంచాయితీ ఒక‌టి తెర లేచిన‌ట్లే. కావేరీ జ‌లాల‌పై రెండు రాష్ట్రాల మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తూనే ఉంది. అయితే.. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కావేరీ జ‌లాల్ని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పు క‌న్న‌డిగుల్ని కోపోద్రిక్తుల్ని చేసింది. చూసేందుకు శాంతంగా క‌నిపించే క‌న్న‌డిగులు.. వారి ప్ర‌యోజ‌నాలు దెబ్బ తిన్నాయ‌ని అనిపిస్తే చాలు ర‌చ్చ ర‌చ్చ చేసేస్తారు. తాజాగా క‌ర్ణాట‌క‌లోని మాండ్య‌లో అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. కావేరీ జ‌లాల్ని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో లేదో.. క‌ర్ణాట‌క‌లోని స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన మాండ్యాలో నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. అవి గంట‌ల వ్య‌వ‌ధిలోనే తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తున్నారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న క‌న్న‌డిగులు.. జ‌య ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు జాతీయ రహ‌దారి మీద భారీ ఎత్తున చేస్తున్న నిర‌స‌న‌ల‌తో రెండు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. నిర‌స‌న‌లు తీవ్ర రూపం దాల్చ‌టంతో క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడుకు బ‌స్సు స‌ర్వీసుల్ని నిలిపివేశారు. మ‌రోవైపు.. ఈ అంశంపై రాజ‌కీయ ప‌రిష్కారం కోసం క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. మ‌రోవైపు సుప్రీం తీర్పును వ్య‌తిరేకిస్తూ రోడ్ల మీద‌కు వ‌చ్చిన ఆందోళ‌న కారులు ప్ర‌భుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మాండ్య మొత్తం ఆగ్ర‌హంతో మండిపోతున్న ప‌రిస్థితి. క‌న్న‌డిగుల ఆగ్ర‌హంపై త‌మిళుల రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తోంది.