Begin typing your search above and press return to search.

ట్రూ లవ్: సోనాలీది ఆత్మవిశ్వాసం... చిత్తరంజన్ ది ఆదర్శం!

By:  Tupaki Desk   |   20 April 2015 12:25 PM GMT
ట్రూ లవ్: సోనాలీది ఆత్మవిశ్వాసం... చిత్తరంజన్ ది ఆదర్శం!
X
ఎత్తు, బరువు, రంగు, సొమ్ము చూసి ప్రేమించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో... వ్యక్తిత్వమే ముద్దు అందం వద్దు అని నిర్ణయించుకున్నారు ఒక ఇంజినీర్. ఎప్పటికైనా అంతఃసౌదర్యమే శాస్వతం అని గ్రహించిన ఒక యువ ఇంజినీర్... యాసిడ్ దాడి బాదితురాలిని వివాహం చేసుకున్నాడు. ఆ యాసిడ్ దాడిలో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది అయినా కూడా అతనికి నచ్చింది. ఇదే ఆదర్శం... ఇదే నిజమైన ప్రేమ!
వివరాల్లోకి వెళితే... యాసిడ్ దాడి బాధితురాలు సోనాలీ ముఖర్జీ చాలా మందికి పరిచయం ఉన్న మహిళే అని చెప్పాలి. యాసిడ్ దాడి బాదితుల తరుపున పోరాటం చేసి... యాసిడ్ బాధితులకు ప్రభుత్వం ఉద్యోగభృతి కల్పించాలంటూ మీడియా ముందుకొచ్చి డిమాండ్ చేసింది! యాసిడ్ దాడిలో ముఖం, మెడ, కుడి ఛాతీ భాగం తీవ్రంగా కాలిపోయినా... మొక్కవోని దైర్హ్యంతో న్యాయపోరాటం సాగిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించింది. ఒకవైపు వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగింది, మరో వైపు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగింది.
18 ఏళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురైన ఈమె జీవితంలో ఇప్పుడు వసంతం వికసించింది. తనను పెళ్లి చేసుకుంటానని ఫేస్ బుక్ ఫ్రెండ్ చిత్తరంజన్ ప్రపోజ్ చేశాడు. జంషెడ్ పూర్ కు చెందిన ఈ చిత్తరంజన్ ఒడిషాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇందుకు ఆమె కూడా అనుమతివ్వడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇందుకు బొకారోలోని కోర్టు హాలు వేదికైంది. ఈ సందర్భంగా ప్రేమ వివాహం చేసుకున్న సోనాలీని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న అతి కొద్దమంది మహిళలో ఒకరిగా ఆమెను గౌరవిస్తామన్నారు. యాసిడ్ దాడి ఘటనతో తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని, ఉత్సాహాన్ని చిత్తరంజన్ తిరిగి తీసుకొచ్చారంటూ తన సంతోషాన్ని, ఉబికి వస్తున్న ఆనందబాష్పాలను ఆపుకుంటూ చెబుతున్నారు సోనాలి.
ఆడ‌పిల్ల ఎంత ధైర్యంగా ఉండాలో, ఎంత ఆత్మ‌విశ్వాసంతో మెలగాలో చెప్ప‌డానికి సోనాలీ ముఖ‌ర్జీ జీవితం స‌జీవ సాక్ష్యం అని పలువురు ఈమెను అభినందిస్తున్నారు. చిత్త రంజన్ నిర్ణయం గొప్ప ఆదర్శవంతం అని మెచ్చుకుంటున్నారు!