Begin typing your search above and press return to search.

విశాఖ జిల్లాకు చెందిన అచ్చియ్యమ్మ సూసైడ్.. అధికార పార్టీ ఇమేజ్ డ్యామేజ్?

By:  Tupaki Desk   |   16 Nov 2022 10:17 AM IST
విశాఖ జిల్లాకు చెందిన అచ్చియ్యమ్మ సూసైడ్.. అధికార పార్టీ ఇమేజ్ డ్యామేజ్?
X
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఆయన పార్టీకి చెందిన కొందరుచోటా నేతలు.. మద్దతుదారులు వ్యవహరిస్తున్న ధోరణి అంతకంతకూ తీవ్రంగా మారటమే కాదు.. వైసీపీ సర్కారుకు సరికొత్త తలనొప్పుల్ని తెచ్చి పెడుతోంది. అధికార పార్టీ అన్న ట్యాగ్ లైన్ ను పట్టుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలు.. చోటా నేతల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు చోటు చేసుకునేవే కాదన్న మాట వినిపిస్తోంది. తాజాగా విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలానికి చెందిన అచ్చియ్యమ్మ ఉదంతమే నిలువెత్తు నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.

వైసీపీ నేతలు కొందరు తమను వేధిస్తున్నారన్న వేదనతో బావిలోకి దూకి మరణించిన వైనం స్థానికంగా కలకలాన్ని రేపటంతో పాటు.. ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా ఉండేలా జగన్ చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇంతకూ అచ్చియ్యమ్మ విషాద ఉందంతం ఏమిటి? ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆమె సూసైడ్ అధికార వైసీపీకి ఎందుకు షాకింగ్ గా మారింది? అన్న విషయాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని గోవిందపురం గ్రామానికి చెందిన భీమేశ్వరరావు.. సోమేశ్వరరావు.. అచ్చియ్యమ్మలు అన్నాచెల్లెళ్లు.

ఇద్దరు సోదరులు కలిసి రెండు సెంట్ల స్థలం (98 గజాలు) సోదరికి బహుమానంగా ఇచ్చారు. కొంతకాలంగా ఈ స్థలానికి సంబంధించి స్థానిక వైసీపీ నేతలకు.. వీరికి మధ్య వివాదం నడుస్తోంది. ఆ భూమి తమదేనంటూ వైసీపీ నేతల వేధింపుల్ని తట్టుకోలేక అచ్చియ్యమ్మ సోదరుడు సోమేశ్వరరావు పురుగులు మందు తాగి గత ఏడాది సెప్టెంబరులో చనిపోయారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల అచ్చియ్యమ్మకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని.. 15 రోజుల్లో దాన్ని ఖాళీ చేయాలని ముదపాక పంచాయితీ కార్యదర్శి నాగప్రభు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి తీవ్రమైన మనోవ్యధకు గురైన ఆమె.. సోమవారం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్ని వెతికారు. వారి ఇంటికి దగ్గర్లోని వ్యవసాయ బావిలో ఆమె డెడ్ బాడీని గుర్తించారు.

దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. మోటార్లు పెట్టి నీళ్లు తోడించి.. ఆమె డెడ్ బాడీని బయటకు తీశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన భార్య డెడ్ బాడీని చూసేందుకు ఆమె భర్త.. సోదరుడు అక్కడకు రాగా.. పోలీసులు వారిని రానివ్వలేదు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటంతో.. డెడ్ బాడీని తీసుకొని గ్రామం నుంచి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి హడావుడిగా తరలించాలని భావించారు.

ఇందులో భాగంగా అచ్చియ్యమ్మ డెడ్ బాడీని చూసేందుకు ఎవరిని అనుమతించలేదు. అంబులెన్సులో హడావుడిగా తీసుకెళ్లే ప్రయత్నంలో.. ఎస్ఐ కాలి మీదుగా అంబులెన్సు పోవటంతో.. ఆయన కాలి మెలి తిరిగిపోయింది. సున్నితంగా వ్యవహరించాల్సిన ఈ ఇష్యూను ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇలాంటి ఉదంతాల పుణ్యమా అని.. వైసీపీ సర్కారు ఇమేజ్ దెబ్బ తింటోందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఫీడ్ బ్యాక్ సీఎం జగన్ వరకు వెళుతుందా? అన్నదే అసలు సందేహంగా చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.