Begin typing your search above and press return to search.

అసాధ్యం కాస్తా సుసాధ్యమైంది.. సృష్టి ధర్మం దారి తప్పనుందా?

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 PM GMT
అసాధ్యం కాస్తా సుసాధ్యమైంది.. సృష్టి ధర్మం దారి తప్పనుందా?
X
యావత్ ప్రపంచంలో మనిషికి మించిన అత్యంత ప్రమాదకారైన జంతువు మరొకరు లేరంటారు. భూమండలంలో మనిషికి జీవించే అవకాశం ఎంత ఉందో.. మిగిలిన జీవాలు మనుగడు సాధించేందుకు అంతే హక్కు ఉంది. కానీ.. ప్రకృతికి ప్రశ్నలు విసిరేలా మనిషి ప్రవర్తన ఉంటుంది. అందుకేనేమో.. ఊరుకున్నంత వరకు ఊరుకొని ఒక్కసారిగా తన ప్రతాపాన్ని ప్రకృతి చూపించటం.. ఆ దెబ్బకు చేష్టలుడిగినట్లుగా మనిషి ఉండిపోవటం చూస్తుంటాం. తాజాగా బయటకు వచ్చిన అద్భుతానికి ఆనందించాలో.. రాబోయే రోజుల్లో దాని విపరిణామాలు మనిషికి కొత్త సవాళ్లు ఎదురయ్యేలా చేసే పరిస్థితికి బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.

ఇప్పటివరకు కృత్రిమ అవయువాల గురించి విన్నాం. కానీ.. సృష్టికి మూలమైన మనిషి జన్మను సైతం కృత్రిమంగా మార్చేసే అద్భుతం తాజాగా ఆవిష్కృతమైంది. మనిషి పుట్టుకకు వీర్యం ఎంతటి కీలక భూమిక పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వీర్యాన్ని ల్యాబుల్లో తయారు చేసే అద్భుతం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

ఈ సైన్స్ అద్భుతంతో సంతాన లేమి సమస్యల్ని ఎదుర్కొనే వారికి తీపికబురుగా మారుతుంది. కానీ.. అది అక్కడితో ఆగదు కదా. డిజైనర్ బేబీ దిశగా అడుగులు పడితే.. సహజ సిద్ధమైన మేధో తనానికి భిన్నంగా.. అంతా కృత్రిమ మేథోతనం పెరిగిపోవటం.. చివరకు సృష్టి ధర్మానికి సవాలుగా మారదా? అన్నదిప్పుడు ప్రశ్న.

'కృత్రిమ వీర్యం' అనే అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఇజ్రాయెల్ పరిశోధకులకే దక్కుతుంది. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యంగా వారు మార్చారు. క్యాన్సర్.. తదితర ఆరోగ్య సమస్యలతో వీర్యాన్ని తయారు చేసే కణాలు దెబ్బ తిన్న వారికి.. తాజాగా ఆవిష్కరించిన అద్భుతం వరంలా మారుతుందని చెప్పాలి. బెన్ గురియన్ వర్సిటీ ఆఫ్ నెగెవ్ ఆధ్వర్యంలోని పరిశోధకులు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు.

అతి సూక్ష్మమైన ద్రవ్య వ్యవస్థ ద్వారా ప్రయోగశాలలో వీర్యాన్ని ఉత్పత్తి చేయటం ఈ ప్రయోగం ఉద్దేశం. అతి క్లిష్టమైన విధానాన్ని అనుసరించి కృత్రిమ వీర్యాన్ని తయారు చేయటంలో సక్సెస్ అయ్యారు. వీర్యం ఉత్పత్తికి సాయం చేసే కణాల్ని డెవలప్ కాని ఎలుకల వ్రషణాల నుంచి తీసిన కణజాలంతో పరిశోధన చేశారు.

ప్రయోగశాలలో సహజ సిద్ధమైన పరిస్థితుల్ని పోలిన వాతావరణంలో అవసరమైన పోషకాలను.. వ్రద్ధి కారకాలను అందిస్తే వ్రషణాల కణాల్ని శుక్ర కణాలుగా మార్చే అవకాశం ఉందని నిరూపించారు. అయితే.. ఇలాంటివాటి కారణంగా ఎదురయ్యే విపరిణామాలు ఏమిటన్న దానిపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరగటం ఖాయమని చెప్పక తప్పదు.