Begin typing your search above and press return to search.

అప్పుడే అచ్చెన్నకు చుక్కలు కనబడుతున్నాయా ?

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:45 AM GMT
అప్పుడే అచ్చెన్నకు చుక్కలు కనబడుతున్నాయా ?
X
రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడుకు అప్పుడే చుక్కలు కనబడుతున్నట్లున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి గా రంగం లోకి దిగిన అచ్చెన్న ఎలాగైనా టీడీపీ ని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగం గానే మూడు రోజులుగా నెల్లూరు లోనే క్యాంపు వేసినా పార్టీ లో అసలు ఏమి జరుగుతోందో కూడా కింజ రాపుకు ఏమీ అర్ధం కాలేదట. పోటీచేస్తున్న అభ్యర్ధులు ఎవరు ? పార్టీ నేతల్లో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు ? ఎవరు దూరంగా ఉన్నారు ? సదరు నేతలు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయాలే అచ్చెన్నకు అర్ధం కావటంలేదని సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాకు సంబంధించి టీడీపీలో చాలా గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో సగం గ్రూపులు నెల్లూరు హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నాయి. ఇపుడు జరగబోయేది కూడా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలే కావటంతో నేతల్లో చాలామంది ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారట. కార్పొరేషన్ పరిధిలోని చాలామంది సీనియర్లను సంప్రదించకుండానే నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు మొత్తం టికెట్లను కేటాయించేశారట. అంటే కార్పొరేషన్లోని 54 డివిజన్లలోను తమకు కావాల్సిన వారికే వీళ్ళద్దరు టికెట్లను పంచేసుకున్నారన్నమాట. విషయం బయటపడటంతో మిగిలిన సీనియర్లంతా ఇపుడు లబోదిబోమంటున్నారు.

అభ్యర్ధులను మార్చాలని, మొదటినుండి పార్టీకోసం పనిచేసిన వారికి కూడా టికెట్లు కేటాయించాలని ఎంత మొత్తుకుంటున్నా పై నేతలిద్దరు ఎవరినీ లెక్క చేయలేదట. బీఫారాలతో పాటు టికెట్లను కూడా తమ మద్దతుదారులకు వీళ్ళద్దరు కేటాయించేసుకోవటంతో చేసేదేమీ లేక సీనియర్ల మండిపోతున్నారు. పైగా వీళ్ళద్దరు వైసీపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలను చేసుకుని మరీ టికెట్లను పంచేసుకన్నారంటు టీడీపీలోనే గోల మొదలైంది.

అధికారపార్టీతో జరిగిన ఒప్పందంలో భాగంగా తమ వాళ్ళు కచ్చితంగా గెలవాలని అనుకున్న డివిజన్లలో వైసీపీ నేతలతో మాట్లాడుకుని బలహీనులను పోటీలోకి దిగేట్లు చూసుకున్నారట. అలాగే మెజారిటి స్ధానాల్లో వైసీపీ అభ్యర్ధుల మీద బలహీనమైన నేతలను వీళ్ళిద్దరు రంగంలోకి దింపారనే గోల పార్టీలో పెరిగిపోతోంది. జరుగుతున్న గోలను చూస్తున్న అచ్చెన్న సమావేశం పెడితే రెండు గ్రూపుల నేతలు హాజరుకాలేదట. దాంతో ఎవరు చేస్తున్నది కరెక్టో కూడా తేల్చుకోలేక అచ్చెన్న అయోమయంలో పడిపోయారట.

కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే రూరల్ మండలంలో బాగా పట్టున్న ఆనం వెంకటరమణారెడ్డిని కూడా టికెట్ల కేటాయింపులో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆనం అలిగి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 6 డివిజన్లలో అభ్యర్ధులను గెలిపించటంలో కీలకంగా వ్యవహరించిన కిలారి వెంకటస్వామినాయుడుకు ఇప్పటి ఎన్నికలతో సంబంధమే లేకుండా పోవటంతో ఆయనా దూరంగా ఉండిపోయారు. వీళ్ళే కాదు పార్టీలో ఎప్పటినుండో పనిచేస్తున్న సికింధర్ రెడ్డి, మన్నెం పెంచలనాయుడు, సత్య నాగేశ్వరరావు, మండవ రామయ్య లాంటి అనేకమంది కనీస మర్యాద కూడా దక్కలేదనే మంటతో ఎన్నికలవైపే చూడటంలేదు. వైసీపీలో కూడా టికెట్లు దక్కని వారు రెబల్సుగా నామినేషన్లు వేసిన వారితో టీడీపీ నుండి కనీసం టచ్ లోకి కూడా ఎవరు వెళ్ళలేదు.

అన్నింటికన్నా హైలైట్ ఏమిటంటే మొత్తం ఎన్నికలకు సీనియర్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రయాదవ్ కూడా దూరంగా ఉండిపోవటం. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీచేయటానికి వీళ్ళద్దరు ప్లాన్లు చేసుకుంటున్నారట. ఈ విషయం తెలియటంతోనే నెల్లూరు నేతలెవరు వీళ్ళని దగ్గరకు కూడా రానీయటంలేదట. దీంతో వీళ్ళు కూడా కామ్ అయిపోయారు. జరుగుతున్నదేమిటో అర్ధంకాక, ఎలా సర్దుబాటు చేయాలో తెలీక అచ్చెన్నకు చుక్కలు కనబడతున్నాయట.