Begin typing your search above and press return to search.

చిక్కోలు హృద‌యాల‌ను గెలిచిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:43 PM GMT
చిక్కోలు హృద‌యాల‌ను గెలిచిన చంద్ర‌బాబు
X
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బీల వద్ద నాగార్జున కన్‌ స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ సీసీ) నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్‌ ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన వారి నిరీక్ష‌ణ ఫ‌లించ‌నుంది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు వ‌ద్దంటూ దాదాపు ఆరేళ్లుగా స్థానికులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట ప్ర‌భుత్వం బీలలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. అక్క‌డ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున కార్మిక శాఖా మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు ఆందోళ‌నకారుల‌కు హామీ ఇచ్చి నిమ్మ‌ర‌సం తాగించ‌డంతో వారు దీక్ష ముగించారు. ఈ సంద‌ర్భంగా సోంపేట ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సంఘం అధ్య‌క్షుడు వై.కృష్ణ‌మూర్తి దీక్ష నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఆరేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ‌ దీక్ష‌కు శుభం కార్డు ప‌డింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...సోంపేట థర్మల్ ప‌వ‌ర్‌ కు అనుమతుల ఇస్తూ 2009లో ఇచ్చిన జీవో 1109ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చెప్పారు. తమ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఎన్‌ సీసీ కంపెనీ మ‌ల్టీ ప్రొడ‌క్ట్స్ ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన అనుమ‌తిని కూడా ర‌ద్దుచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ భూముల్లో వ్య‌వ‌సాయాధారిత పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సంఘం అధ్య‌క్షుడు వై.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ....2009 నుంచి త‌మ దీక్ష సాగుతోందని చెప్పారు. 2,166 రోజులు సాగిన త‌మ దీక్ష‌లో హుద్‌ హుద్‌ - పైలిన్ తుపాను స‌మ‌యంలోనూ కొన‌సాగింద‌ని తెలిపారు. ఈ పోరాటంలో అసువులు బాసిన వారికి ఈ సంద‌ర్భంగా కృష్ణ‌మూర్తి నివాళులు అర్పించారు.