Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీ అధికారిక ప్రెస్ నోట్ ప్రకారమే.. 250 వాహనాల్ని వెనక్కి

By:  Tupaki Desk   |   17 April 2021 10:46 AM GMT
ఏపీ డీజీపీ అధికారిక ప్రెస్ నోట్ ప్రకారమే.. 250 వాహనాల్ని వెనక్కి
X
తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల్ని.. ఉప ఎన్నికల్ని చూసింది. అయితే.. ఇప్పటివరకు మరెప్పుడూ లేని సరికొత్త పరిణామాలు మాత్రం తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లోనే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇంతకాలం సైలెంట్ రిగ్గింగ్.. వ్యూహాత్మకంగా ఓటింగ్ పెంచటంలాంటివే విన్నాం.. చూశాం. అందుకుభిన్నంగా ఇతర ప్రాంతాల నుంచి బస్సులు.. కార్లలో వందలాది మందిని పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకొచ్చిన వైనం ఇదే తొలిసారి వింటున్నది.

సాధారణంగా పోలింగ్ ఎక్కడ జరిగినా స్థానిక ఓటర్లు ఎవరు? స్థానికేతరులు ఎవరన్న విషయంపై క్లారిటీ ఉంటుంది. అయితే.. తిరుపతి లాంటి పెద్ద పట్టణాల్లో ఇలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే.. లక్షలాది మందిలో అందరూ తెలిసిన ముఖాలే ఉండాల్సిన అవసరం లేదు. అంత పెద్ద ఊళ్లో.. మనకు తెలిసిన వారి కంటే తెలియని వారే ఎక్కువగా ఉంటారు. తిరుపతిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన తర్వాత నుంచి వివిధ పార్టీలకు చెందిన వారు తిరుపతిలో పెద్ద ఎత్తున స్థానికేతరులు ఓట్లు వేసేందుకు వచ్చినట్లుగా గుర్తించారు.

పలువురిని ఎక్కడ నుంచి వచ్చామని అడిగితే చెప్పలేదుకానీ.. వారంతా ఓట్లు వేసేందుకు క్యూలో నిలుచోవటం సంచలనంగా మారింది. ఆశ్చర్యకరంగా వారి చేతుల్లో ఉన్న ఓటరు కార్డులన్ని నకిలీవిగా ఆరోపిస్తున్నారు. వీరంతా వైసీపీకి ఓట్లు వేయటానికి వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్నది పక్కన పెడితే..ఇలాంటి నకిలీ ఓటు కార్డులు పట్టుకొని లైన్లో నిలుచొని ఓట్లు వేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పాలి.

వీరంతా నకిలీ ఓటర్లు అని ఎలా చెబుతున్నారన్నప్రశ్న తలెత్తే వీలుంది. కొందరు మీడియా ప్రతినిధులు.. మరికొందరు తమకు తాముగా.. ఓటర్లుగా ఉన్న వారిని.. వారి తండ్రిపేరు.. ఇంటి డోర్ నెంబరు అడిగితే ఎవరూ సమాధానం చెప్పకపోవటం చూస్తే.. వారంతా బయటప్రాంతాల నుంచి వచ్చిన వారన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటివేళ.. ఏపీ డీజీపీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఉన్న మిగిలిన అంశాలన్ని రోటీన్ గా ఉన్నవే. ఒక్క అంశం దగ్గర మాత్రం కళ్లు ఆగిపోతాయి. అదేమంటే.. తిరుపతిలోకి వస్తున్న 250కు పైగా వాహనాల్ని వెనక్కి పంపినట్లుగా పేర్కొన్నారు.

ఓపక్క తిరుపతిలోకి పెద్ద ఎత్తున వాహనాలు వచ్చిన ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఏపీ డీజీపీ 250కుపైగా వాహనాలు నగరంలోకి రాకుండా తాము అడ్డుకున్నామని పేర్కొన్నారు. ఈ లెక్కన ఏపీ పోలీసులు పెద్ద మనసుతో.. కర్తవ్య నిష్ఠతో 250కు పైగా వాహనాల్ని ఆపేసి..వెనక్కి తిప్పి పంపకుంటే.. ఈ రోజున తిరుపతిలో మరెలాంటి సీన్లు చూడాల్సి వచ్చేదేమో?