Begin typing your search above and press return to search.

ప‌సుపు పంట‌తో రూ.500 కోట్లు సంపాదించా

By:  Tupaki Desk   |   4 Oct 2017 6:14 AM GMT
ప‌సుపు పంట‌తో రూ.500 కోట్లు సంపాదించా
X
అవినీతి నిరోధ‌క శాఖ‌ చరిత్రలోనే అత్యంత అవినీతి కేసుగా నమోదైన ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరక్టర్‌ గోళ్ల వెంకట రఘు ఉదంతంలో సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ర‌ఘు ఏసీబీ అధికారులకు దిమ్మదిరిగే సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు తాను వ్యవసాయం చేసి ఈ ఆస్తులన్నీ సంపాదించానని చెప్పినట్లు సమాచారం. పసుపు పంటను వేశానని - అందులో వచ్చిన లాభాలతోనే బంగారు - వజ్రాభరణాలతో పాటు భూములు కొనుగోలు చేశానని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరక్టర్‌ గోళ్ల వెంకట రఘు స్పష్టం చేయ‌డంతో అవాక్క‌వ‌డం ఏసీబీ అధికారుల వంత‌యిందట‌.

త‌న సంపాద‌న‌ - ఆస్తిపాస్తుల్లో ఎటువంటి అవినీతి లేదని ఆయన వాదించడంతో ఏసీబీ అధికారుల‌కు దిమ్మ‌తిరిగి పోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తన ఆస్తులన్నీ సక్రమమైనవేనని - తన ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఆదా చేసిన నగదునే వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టానని ర‌ఘు చెప్పారని తెలుస్తోంది. మ‌రోవైపు రఘు కేసు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించడంతో తెలంగాణ ఏసీబీ అధికారులతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారి సహకారంతో సమాచార మార్పిడి ద్వారా ఉమ్మడి రాజధానితో పాటు తెలంగాణలో ఉన్న రఘు బినామీలకై ఆరా తీస్తున్నారు.

కాగా, రఘుకు చెందిన బినామీ కంపెనీలో ఓ ఐఎఎస్‌ అధికారి కుమార్తె ఒక వాటాదారుగా ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నేతల బంధువులూ సూట్‌ కేస్‌ కంపెనీల్లో బోర్డు సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు సమయంలోనే అధికారుల పై కొంత ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. రాజకీయ - ఉన్నతాధి కార వర్గాల్లోనూ తనకున్న పలుకుబడి ద్వారా కేసు తీవ్రతను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు రఘు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉన్న రఘు బినామీలను గుర్తిస్తే మరిన్ని అక్రమాస్తులు వెలుగు చూసే అవకాశముంది. మరింత కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సాధ్యమైనంత త్వరగా రఘుతో పాటు సహ నిందితులు నల్లూరి శివప్రసాద్‌ - చింతమనేని గాయత్రిలను కస్టడీకి తీసుకుని విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

మ‌రోవైపు ర‌ఘు బినామీగా అనుమానిస్తున్న లైసెన్డ్స్‌ సర్వేయర్‌ సిహెచ్‌ గోవిందరాజుకు చెందిన విశాఖపట్నంలోని ఇంటిని ఎసిబి అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘుకు చెందిన సూట్‌ కేసు కంపెనీ ఎస్‌ పిఎస్‌ ఇన్‌ ఫ్రా పేరు మీద 81 ఎకరాల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. 2012లో రిజిష్టర్‌ అయిన ఎస్‌ పిఎస్‌ ఇన్‌ ఫ్రాలో ప్రధాన నిందితుడు రఘు అత్త బసివిరెడ్డి కళావతమ్మకు సుమారు 16.68 శాతం వాటా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అధికారులు గుర్తించిన భూమిలో ఆరు ఎకరాలు అవుటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే ఉండటం విశేషం. మెదక్‌ జిల్లా పటాన్‌ చెరువు సమీపం లోని పాటి గ్రామంలో ఉన్న అత్యంత విలువైన ఈ భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అనంతపురం జిల్లా గోరంట్ల వద్ద మరో 75 ఎకరాలకు సంబంధించిన దస్తావేజుల్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ గా రఘు విధులు నిర్వహించే సమయంలో సర్వేయర్‌ గోవిందరాజుతో పరిచయమేర్పడింది. ఈ పరిచయంతోనే సర్వేయర్‌ సహకారంతో అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది.