Begin typing your search above and press return to search.

స్టే ర‌ద్దు!... బాబుకు బ్యాండేనా?

By:  Tupaki Desk   |   26 April 2019 9:18 AM GMT
స్టే ర‌ద్దు!... బాబుకు బ్యాండేనా?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుకు ఇప్పుడు అన్ని గ‌డ్డు ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నెల 11న జ‌రిగిన పోలింగ్ లో ఓట‌ర్లలో మెజారిటీ విప‌క్ష వైసీపీ వైపు మొగ్గార‌న్న వాద‌న‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై చంద్ర‌బాబుకు కూడా ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింద‌ని - అధికారం ద‌క్క‌క‌పోతే ప‌రిస్థితి ఏమిట‌న్న కోణంలో ఆయ‌న ఇప్పుడు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌న్న విశ్లేష‌ణ‌లూ సాగుతున్నాయి. ఇలాంటి కీల‌క త‌రుణంలో మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా ఇప్పుడు చంద్ర‌బాబుకు మ‌రో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌న్న కేసులో చంద్ర‌బాబుకు ఇప్ప‌టిదాకా ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉన్న స్టే తొల‌గిపోయింది. అంతేకాదండోయ్‌... స్టే తొలగిపోయిన వెంట‌నే ఈ కేసు విచార‌ణ‌ను ఏసీబీ కోర్టు ప్రారంభించేసింది. ఈ విష‌యం ఇప్పుడు ఏపీతో పాటు దేశ‌వ్యాప్తంగానూ ఆస‌క్తి నెల‌కొంది.

ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే... చంద్ర‌బాబు ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని - దీనిపై విచార‌ణ చేప‌ట్టి ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు - దివంగ‌త సీఎం ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీపార్వ‌తి 2005లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచార‌ణ సాగ‌కుండా ఉత్త‌ర్వులు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన చంద్ర‌బాబు స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు స్టే కార‌ణంగా ఏసీబీ కోర్టు ఈ కేసు విచార‌ణ‌ను నిలిపివేసింది. తాజాగా సుదీర్ఘ కాలంగా ఉన్న స్టేల‌ను ఎత్తివేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇటీవ‌లే సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ‌పై కొన‌సాగుతున్న స్టే కూడా ర‌ద్దైపోయింది.

ఈ క్ర‌మంలో కాస్తంత వేగంగానే స్పందించిన ఏసీబీ కోర్టు... ఈ కేసు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ల‌క్ష్మీపార్వ‌తికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ స‌మ‌న్ల‌ను తీసుకున్న ల‌క్ష్మీపార్వ‌తి కాసేప‌టి క్రితం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో ఈ కేసులో ఏసీబీ విచార‌ణ ప్రారంభ‌మైపోయింద‌నే చెప్పాలి. అంతేకాకుండా ఈ కేసు స్టేట‌స్ పై వ‌చ్చే నెల 13న విచారిస్తామ‌ని కూడా ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచార‌ణ‌ను వ‌చ్చే నెల 13కు వాయిదా వేసింది. మొత్తంగా త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు తెచ్చుకున్న ఈ స్టే ర‌ద్దు కావ‌డంతో ఇక‌పై ఈ కేసులో విచార‌ణ వేగ‌వంతం కానుంద‌ని - చంద్ర‌బాబుకు ఈ కేసులో ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.