Begin typing your search above and press return to search.

సంచలనం: హత్య కేసును తవ్వుతుంటే.. భారీ స్కాం బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:00 PM GMT
సంచలనం: హత్య కేసును తవ్వుతుంటే.. భారీ స్కాం బయటకొచ్చింది
X
ఒక హత్య కేసును విచారిస్తున్న పోలీసుల కారణంగా అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ స్కాం ఒకటి బయటకు వచ్చింది. ఆ మాటకు వస్తే.. అసలు ఆ స్కాం కారణంగానే హత్య జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కల్యాణ లక్ష్మీ.. షాదీ ముబారక్ కుంభకోణం పలు మలుపులు తిరుగుతోంది. అదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పని చేసే ఒక సీనియర్ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఇచ్చోడ మీ సేవా సెంటర్ ప్రధాన కేంద్రంగా ఈ స్కాం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

దాదాపు ఐదు మండలాల్లో మొత్తం 113 మంది అనర్హులకు కోటి రూపాయిలకు పైగా చెక్కుల్ని అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. అడ్డదారిలో వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో జరిగిన గొడవలు ఒక హత్యకు దారి తీసింది. ఈ కేసు విచారణతో స్కాం బయటకు వచ్చింది. దీంతో.. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న మీ సేవా సెంటర్ల యజమానులతో పాటు.. వీరికి సహకరించిన ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. అదిలాబాద్ జిల్లాలో ఈ మధ్యన ఎవరికి కావాలంటే వారికి షాదీ ముబారక్.. కల్యాణ్ లక్ష్మీ చెక్కులు మంజూరు అయ్యాయి. అయినప్పటికీ ఎవరికి అనుమానం రాలేదు. ఎప్పుడైతే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి హత్యకు గురి కావటం.. అతని హత్య వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో విచారించిన పోలీసులకు.. ఆశ్చర్యకరంగా ఈ కుంభకోణం మొత్తం బయటకు వచ్చింది. ఈ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆర్డీవో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నదీం పరారీలో ఉన్నాడు. అతను పోలీసులకు చిక్కితే.. ఈ కేసు చిక్కుముడి పూర్తిగా వీడిపోతుందని చెబుతున్నారు. ఈ స్కాంలో భాగస్వామ్యం అయిన వారందరిని ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. కాసుల కక్కుర్తికి పాల్పడిన వారంతా ఇప్పుడు నిందితులుగా మారి ఊచలు లెక్కిస్తున్న దుస్థితి.