Begin typing your search above and press return to search.

అచ్చెన్న అరెస్ట్.. మాజీ మంత్రి కుమారుడే టార్గెటా?

By:  Tupaki Desk   |   13 Jun 2020 10:10 AM GMT
అచ్చెన్న అరెస్ట్.. మాజీ మంత్రి కుమారుడే టార్గెటా?
X
టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయ్యాక నెక్ట్స్ ఎవరనే చర్చ రాజకీయావర్గాల్లో సాగుతోంది. జగన్ ప్రభుత్వం ఇంకా ఎవరిని టార్గెట్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆయన టార్గెట్ గా రాజకీయ ప్రచారం సాగుతుండడంతో పితాని ఆందోళన చెందుతున్నారు. పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు ఖండించారు.

గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన నిర్వహించిన శాఖల్లో ఆరోపణలు, వివాదాలు పెద్దగా లేవు. ఈ వ్యవహారంలో కావాలని కొందరు పితానిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వర్గం ఆరోపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

అయితే పితాని ప్రమేయం ఎక్కడా బయట పడక పోవడంతో ఆయన కుమారుడిని టార్గెట్ చేశారనే ప్రచారం ఉధృతమైంది.దీనిపై తాజాగా పితాని మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్షం నోరు నొక్కేసి పాలించాలని అధికారపక్షం భావిస్తోంది. ఇది ప్రజాస్వామ్యహితం కాదు. ఇప్పటికే ఇదే విషయం చెబుతూ వచ్చా.. కార్మికమంత్రి పనిచేసిన సమయంలో కొందరి అధికారుల తీరుపై తానే విచారణకు ఆదేశించారు. తనపై ఇప్పుడు లేనిపోని ఆరోపణలు తెరమీదకు తెచ్చారని’ పితాని ఏకరువు పెట్టారు. దేనికి భయపడనని.. ధైర్యంగా ఎదుర్కోంటానని పితాని స్పష్టం చేశారు.