Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయంలో స్కాం వెలికితీసిన ఏసీబీ?

By:  Tupaki Desk   |   22 Sep 2021 7:56 AM GMT
ఏపీ సచివాలయంలో స్కాం వెలికితీసిన ఏసీబీ?
X
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం రిలీఫ్ పేరిట దందా సాగినట్టుగా ఏసీబీ గుర్తించినట్టు సమాచారం. ఇంటిదొంగలే ఇందుకు సహకరించినట్టుగా నిగ్గు తేల్చినట్టు తెలిసింది. పేదల డేటా సేకరించి వాళ్ల పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను కొందరు కేటుగాళ్లు స్వాహా చేశారని తెలిసింది. ఈ మేరకు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మీడియా రిపోర్టులను బట్టి.. ఈ కుంభకోణంలో ఒకరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది కుమ్మక్కై గూడుపుఠాణీ నడిపారని తేలింది. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం.

ఇప్పటికే ఈ సీఎంఆర్ఎఫ్ స్కాంలో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా విస్తరించింది.. ఎవరెవరు ఈ కుంభకోణంలో ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు.

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం ఏపీలో గత ఏడాది సెప్టెంబర్ లోనూ కలకలం రేపింది. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మోసంలో ఒక కీలక సూత్రధారిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.117 కోట్లు కొట్టేయాలని ముగ్గురు స్కెచ్ గీశారని.. వారిపై ఫిర్యాదు మేరకు కేసులు నమోదైంది.

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తి ఈ ఉదంతానికి తెరతీసినట్లు అప్పట్లో గుర్తించారు.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లడం.. తన పలుకుబడిని ఉపయోగించి వారికి సాయం చేయడం చేశాడు. అలా వచ్చిన చెక్కులను తన ఖాతాలో వేసుకోవడం. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇవ్వడం చేశాడు. సీఎంఆర్‌‌ఎఫ్‌ నుంచి వచ్చిన చెక్కులను పెద్ద మొత్తంలో ఉన్న అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఈ కేసులో ఏసీబీ అధికారులు సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో 1500 మంది వరకూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో వెయ్యి కూడా లక్షకు మించి లేవు. మిగతావన్నీ లక్షలోపేనని వారు వివరించారు. కానీ అదే సమయంలో వివిధ చెక్కుల పేరుతో డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.