Begin typing your search above and press return to search.

అమ్మానాన్నలను తిట్టారా.. మీ పని అంతే

By:  Tupaki Desk   |   16 March 2017 6:16 PM IST
అమ్మానాన్నలను తిట్టారా.. మీ పని అంతే
X
పిల్లల ఆదరణ పొందలేకపోతున్న వృద్ధ తల్లిదండ్రులకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఓ సంచలన తీర్పును వెలువరించింది. వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు దూషిస్తే వారు నివసించే ఇంటి నుంచి వారిని బయటకు పంపించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ, సీనియర్ సిటిజన్స్ చట్టం 2007లోని నిబంధనలను ఉటంకిస్తూ జస్టిస్ మన్మోహన్ తీర్పు ఇచ్చారు. వృద్ధులు ప్రశాంతంగా వారి ఇంట్లో జీవించేందుకు, తమను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న కుమారుడితో కలసి ఉండే ఒత్తిడి చేయకుండా చూసేందుకు ఎవిక్షన్ ఆర్డర్ (పిల్లల్ని బయటకు పంపాలంటూ ఆదేశాలు) జారీ చేయవవ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు వారి సొంతది కాకపోయినా వారికి ఈ హక్కు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు చట్టంలో తగిన మార్పులు చేయాలని, అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సుహృద్భావ సంబంధాలు ఉన్నంత వరకు, కుమారుడు భారంకానంతవరకూ తమతో కలసి ఉండేందుకు తల్లిదండ్రులు అనుమతించవచ్చని ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు పేర్కొంది.

కాగా ఇంతకుముందు తల్లిదండ్రుల ఆదరణ పొందలేకపోతున్న చిన్నారుల విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు మంచి తీర్పే ఇచ్చింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పొందే హక్కు ప్రతి చిన్నారికీ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరి లో ఏ ఒక్కరి నుంచి ప్రేమానురాగాలను నిరోధించినా అది చిన్నారుల ప్రయోజనాలకు భంగకరమని వ్యాఖ్యానించింది. ఏ పేరెంట్‌ అయినా తన సంరక్షణలో ఉన్న చిన్నారిని తల్లి/తండ్రితో కలుసుకోనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు అంటే.. మున్ముందు సదరు చిన్నారి జీవితంపై పడే పెను ప్రభావాన్ని ఆమె/అతను గ్రహించలేకపోతున్నారని అర్థం అని పేర్కొంది. ఈ మేరకు కెన్యాలో ఉంటున్న ఓతండ్రికి తల్లితో కలిసి ఉంటు న్న మైనర్‌ కుమారుడిని కలిసే అవకాశాన్ని కల్పిస్తూ జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజోగ్‌ - యోగేశ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రుల కోసం కూడా ఇలాంటి తీర్పివ్వడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/