Begin typing your search above and press return to search.

బాబు చేసిన త‌ప్పును చెప్పిన ఆర్కే!

By:  Tupaki Desk   |   9 Jun 2019 6:38 AM GMT
బాబు చేసిన త‌ప్పును చెప్పిన ఆర్కే!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆంధ్ర‌జ్యోతి వేమూరి రాధాకృష్ణ‌కు మ‌ధ్య‌నున్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వారి మ‌ధ్య బంధం తెలుగు ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే. అలాంటి రాధాకృష్ణ ప‌వ‌ర్ పోయిన బాబు చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. త‌న‌కు అత్యంత సన్నిహిత‌మైన బాబు ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు చేస్తున్న‌ప్పుడు చెప్పాల్సింది పోయి.. ప‌వ‌ర్ పోయిన త‌ర్వాత ఆయ‌న త‌ప్పుల చిట్టాను ఎత్తి చూపించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌తి వారం త‌న ప‌త్రిక‌లో రాసే వీకెండ్ కామెంట్ లో ఈ సారి ఆయ‌న బాబు చేసిన త‌ప్పుల్ని ప్రస్తావించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న మీద త‌న రివ్యూ చేసిన ఆయ‌న ఇప్ప‌టికైతే బాగా చేస్తున్నార‌న్న మాట‌ను చెప్పేయ‌టం గ‌మ‌నార్హం.

పాల‌నా ప‌రంగా బాబు చేసిన త‌ప్పుల్ని.. జ‌గ‌న్ చేయ‌ర‌న్నట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి. కొంద‌రు ఆడిన గేమ్ లో బాబు ఎలా బుక్ అయ్యారో చెప్పే ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. తాజా వ్యాఖ్య‌ల‌తో పాల‌నా ప‌రంగా బాబు త‌ప్పులు చాలానే చేశార‌న్న విష‌యాన్ని చెప్పేసిన‌ట్లైంది.

బాబు చేసిన త‌ప్పును ఆర్కే మాట‌ల్లో చూస్తే..

+ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమేమి తప్పులు చేశారో గమనించిన జగన్ మోహన్‌ రెడ్డి, తాను ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో, తన నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేరన్న సంకేతాలను కూడా స్పష్టంగా పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుంపట్లు ఎక్కువ కనక - తన పట్ల ప్రధాన కులాలకు వ్యతిరేకత ఏర్పడకుండా మంత్రులు - అధికారుల నియామకంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

+ ఈ క్రమంలోనే, కొంచెం అతిగా అనిపిస్తున్నప్పటికీ ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. ఆది నుంచీ తనకు అండగా ఉంటూ వచ్చిన దళితులకు మంత్రి పదవులు, అధికారిక నియామకాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించారు.

+ రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.తెలుగు దేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న బీసీలను ఆకట్టుకోవడానికై మంత్రి పదవులలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో, కాపులకు కూడా పెద్దపీట వేశారు.

+ ముఖ్యమంత్రిగా కార్యాలయ అధికారుల నియామకంలో కూడా జగన్మోహన్‌ రెడ్డి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు పేషీలో పని చేసిన ఒక ముఖ్య అధికారి కారణంగా ఐ.వై.ఆర్‌. కృష్ణారావు - అజయ్‌ కల్లం వంటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారారు. భవిష్యత్తులో తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవ్వాలంటే అడ్డు వస్తారనుకున్న అధికారులను సదరు అధికారి ఇబ్బందులపాలు చేశారు. అధికారుల నియామకాల్లో అడుగడుగునా చంద్రబాబు కళ్లకు గంతలు కట్టారు.

+ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన దళిత వర్గానికి చెందిన పీవీ రమేశ్‌ సమర్థుడు - సౌమ్యుడు కూడా! అయితే, ఆయన రాష్ట్రంలో ఉంటే తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా సీనియారిటీ ప్రకారం అడ్డు వస్తారని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయేలా పొగబెట్టారు.

+ అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైన అజయ్‌ కల్లంకు, పీవీ రమేశ్‌కు మధ్య విభేదాలు సృష్టించారు. ఇవేమీ తెలియని చంద్రబాబు పీవీ రమేశ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అజయ్‌ కల్లం అంటే చంద్రబాబుకు గౌరవం ఉండేది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అజయ్‌ కల్లంకు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌ పోస్ట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

+ అయితే, అజయ్‌ కల్లంకు ఆ పోస్ట్‌ ఇవ్వనివ్వకుండా చంద్రబాబు పేషీలోని ముఖ్య అధికారే అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబుపై అజయ్‌ కల్లం ద్వేషం పెంచుకున్నారు. చెప్పుకొంటూపోతే, ఇలాంటి ఉదంతాలు ఎన్నో!

+ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఇవన్నీ తెలుసో లేదో తెలియదు గానీ, చంద్రబాబుకు దూరమైన అజయ్‌ కల్లం, పీవీ రమేశ్‌ను కుడి, ఎడమల పెట్టుకున్నారు. అయితే, ఈ ఇరువురు అధికారుల మధ్య గతంలో సఖ్యత లేనందున ఇప్పుడు కలిసి మెలసి పని చేస్తారో లేదో తెలియదు. అయితే, చంద్రబాబు దగ్గర అధికారుల ఆటలు సాగినట్టు జగన్మోహన్‌ రెడ్డి దగ్గర సాగవు.

+ అవినీతి నిర్మూలన - పారదర్శకత విషయంలో ఇటు అధికారులు, అటు పార్టీ శాసన సభ్యులు - మంత్రులు ఎంత వరకు సహకరిస్తారో తెలియదు గానీ - ముఖ్యమంత్రిగా జగన్ మోహన్‌ రెడ్డి మాత్రం చిత్తశుద్ధినే ప్రదర్శిస్తున్నారు.