Begin typing your search above and press return to search.

కేసీఆర్ గ్రాఫ్ పెంచేస్తున్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   22 Jun 2020 5:30 PM GMT
కేసీఆర్ గ్రాఫ్ పెంచేస్తున్న కాంగ్రెస్‌
X
మొద‌ట అనుమానం పుట్టించేలా...త‌ర్వాత ఆశ్చ‌ర్యం క‌లిగించేలా...కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సాటెవ్వ‌రూ రారేమో. ప్ర‌జ‌లంతా ఒక లెక్క వేసుకుంటుంటే ఆయ‌న ఇంకో లెక్క వేస్తారు. ఆ నిర్ణ‌యంతో...మ‌నం త‌ప్పు అంచ‌నా వేసుకున్నాం అనే ఫీలింగ్ క‌లిగిస్తారు. అలా తాజాగా ఓ కీల‌క నిర్ణ‌యం విష‌యంలో సామాన్యుల అంచ‌నాలు త‌ప్పేలా చేయ‌డ‌మే కాకుండా... ప్ర‌త్య‌ర్థుల నుంచి సైతం ప్ర‌శంస‌లు పొందేలా..తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. చైనాతో ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా మ‌ర‌ణించిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కార‌మే...క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి రూ.5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు అభిషేక్ సింఘ్వి స్పందించిన తీరుపై కేసీఆర్ గురించిన ఈ ఆస‌క్తిక‌ర‌ విశ్లేష‌ణ‌ను రాజ‌కీయ వ‌ర్గాలు తెర‌మీద‌కు తెస్తున్నాయి.

సంతోష్ బాబు వీర మ‌ర‌ణం పొందిన అనంత‌రం ఆయ‌న భౌతిక కాయాన్ని తీసుకువ‌చ్చిన స‌మ‌యంలో... తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లి నివాళి అర్పించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న తీరును సోష‌ల్ మీడియాలో త‌ప్పుప‌ట్టారు. అయితే, కేసీఆర్ మాత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఇవ్వ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం, సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట వెళ్లి.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబాన్ని పరామ‌ర్శించారు. క‌ల్న‌ల్‌ కుటుంబ‌స‌భ్యుల‌కు చెక్‌, జాబ్ ఆఫ‌ర్‌తో పాటు ఇంటి స్థ‌లానికి చెందిన ప‌త్రాల్ని అందించారు. స‌హజంగానే దీనిపై ప్ర‌శంస‌లు కురిశాయి.

అయితే, కాంగ్రెస్ పెద్ద‌ల‌కు స‌న్నిహితుడ‌నే పేరున్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అభిషేక్ సింఘ్వి మాత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి తెలంగాణ స‌ర్కార్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేసింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుస‌రించాల‌ని ఎంపీ అభిషేక్ సింఘ్వి అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు త‌న‌ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ దివంగ‌త సైనికుడి కుటుంబాన్ని తీరును ప్ర‌శంసించారు. క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబం అనుభ‌విస్తున్న బాధ‌ను తీర్చేందుకు.. తెలంగాణ స‌ర్కారు వేగంగా స్పందించిన తీర‌ను మెచ్చుకున్నారు. తెలంగాణ ఫాలో అవుతున్న విధానాన్ని ఇత‌ర రాష్ట్రాలు కూడా అనుస‌రించాల‌ని సింఘ్వి త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే విరుచుకుప‌డుతుంటే... ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడు మాత్రం కేసీఆర్ విధానాలు దేశానికే ఆద‌ర్శం అని ప్ర‌శంసించ‌డం విశేషం. అంతేకాకుండా స‌హ‌జంగా ఢిల్లీ నేత‌లు ద‌క్షిణాది రాష్ట్రాల నాయ‌కులను గుర్తించ‌ర‌ని, వారి మంచిని కీర్తించ‌ర‌నే భావ‌న‌ను సైతం కేసీఆర్ త‌న చ‌ర్య‌ల‌తో ప‌క్క‌న పెట్టించ‌గ‌లిగారు. కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం ఒక‌నాడు ఇదే పార్టీ ఢిల్లీ పెద్ద‌ల‌ను షాక్‌కు గురి చేస్తే...ఇప్పుడు ఫిదా చేసింద‌నేది మాత్రం నిజం.