Begin typing your search above and press return to search.

అభినవ షాజహాన్... భార్యకు ప్రేమతో తాజ్ మహల్

By:  Tupaki Desk   |   23 Nov 2021 2:30 AM GMT
అభినవ షాజహాన్...  భార్యకు ప్రేమతో తాజ్ మహల్
X
ప్రపంచంలో ప్రేమను మించింది మరొకటి లేదు. ఈ ప్రేమను దక్కించుకోవడానికి ఎంతోమంది ఎన్నో చేశారు.. చేస్తున్నారు... చేస్తారు కూడా.. అంతేకాకుండా ఈ ప్రేమ చూపించడానికి చాలామంది వారి సర్వస్వాన్ని పణంగా పెడుతుంటారు. ఎందుకంటే ప్రేమను చూపించడానికి ప్రామాణికాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇలానే ప్రేమను చూపించాలి అనే ఎవరూ నిర్వచించలేదు. ఇలా చేస్తేనే అది ప్రేమ అవుతుందని ఎవరు చెప్పలేదు. ఎవరికి నచ్చినట్టుగా వారు వారి ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కావాల్సిందల్లా ఆ ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తి ఉండడమే. అయితే భార్యకు తన ప్రేమను ఓ వ్యక్తి తనదైన రీతిలో వ్యక్తం చేశారు. భార్యమీద అమితమైన ప్రేమ ఉన్నటువంటి ఆయన ఏకంగా తాజ్ మహల్ లాంటి ఓ అందమైన ఇంటిని నిర్మించి బహుమతిగా ఇచ్చారు.

ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ మాదిరిగా ఎంచుకుని అందుకు తగ్గట్టుగా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నిర్మాణానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టారు ఆ వ్యక్తి. ఆయనే ఆనంద్ చౌక్సీ. కోట్ల రూపాయలను వెచ్చించి తన భార్యకు ఆనంద నిలయం లాంటి తాజ్ మహాల్ ను బహుమతిగా ఇచ్చారు. ఇంత ఖర్చు పెట్టడం అవసరమా... అని అడిగితే 'నా భార్య పై నాకు ఉన్న ప్రేమను చూపించడానికి ఇవన్నీ కూడా సరిపోవు అని కచ్చితంగా చెబుతున్నారు' ఈ అభినవ షాజహాన్.

ఇంతకీ ఆ తాజ్ మహల్ లాంటి ఇల్లు ఎక్కడంటే... మధ్యప్రదేశ్లోని బుర్హాన్ పూర్ లో నిర్మించారు ఆనంద్. ఈ ప్రత్యేక ఇంటి నిర్మాణానికి కారణాలు లేకపోలేదు. షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ ఇక్కడే చనిపోయారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు ఆనంద్ చెప్పారు. తనకు భార్య అంటే ఎంతో ప్రేమని అయితే దానిని కేవలం చీరలు, బంగారం రూపంలో చూపించడం ఇష్టం లేదని చెప్పారు. అందుకే తాజ్ మహల్ లాంటి ఇంటిని నిర్మించి ఇవ్వాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు అనుకున్నదే తడవుగా ఇందుకు సంబంధించిన ప్లాన్ ను సంబంధిత ఇంజనీర్ తో తయారు చేయించి... పనులు మొదలు పెట్టారు. అందులో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అనుకున్న పని పూర్తి చేశారు.

ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని ఆనంద్ చెప్పారు. ఇంటికి సంబంధించిన ప్రత్యేక డిజైన్ కోసం బంగాల్ నుంచి ప్రత్యేక కళాకారులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటి మీదున్న పైకప్పును తాజ్ మహల్ కు ఉన్నట్లు నిర్మించేందుకు ఇండోర్ నుంచి నిపుణులను రప్పించి... అందమైన కళాకృతులను తీర్చి దిద్దించారు. మాక్రాన కు ప్రసిద్ధి అయిన రాజస్థాన్ నుంచి ఇంటి కింద పరిచేందుకు మార్బుల్స్ ను తెప్పించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ ఇంట్లో పెద్ద హాలు ఆకర్షణీయంగా ఉంటుందని చూసిన వారు చెబుతున్నారు.

వీటితో పాటు ఇంట్లో కింది భాగాన రెండు గదులు, పైన మరో రెండు గదులను ఏర్పాటు చేసినట్లు ఆనంద్ తెలిపారు. వీటితోపాటు భార్యకు ఇష్టమైనటువంటి బుక్స్ ను ఉంచేందుకు ఒక లైబ్రరీని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఉదయం పూట ధ్యానం చేయడానికి ధ్యాన మందిరం కూడా ఇంట్లో ఉంటుంది. రాత్రి సమయంలో మిరుమిట్లు గొలిపే విధంగా తాజ్ మహల్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉండేటట్లు ఆ ఇంటికి ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు ఆనంద్. ఇలా తనదైన స్టయిల్ లో భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా సుందరమైన మందిరం వంటి ఇంటిని బహుమతిగా అందించారు. ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్ మహల్ రూపంలో ఉన్న ఈ ఇంటిని చూసి ఆనంద్ కూడా మిక్కిలి ఆనందం వ్యక్తం చేశారు.