Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా మారిన బింద్రా బుల్లెట్ ట్వీట్

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:44 PM GMT
సంచ‌ల‌నంగా మారిన బింద్రా బుల్లెట్ ట్వీట్
X
అభిన‌వ్ బింద్రా. చాలా త‌క్కువ‌గా మాత్ర‌మే మీడియాలో క‌నిపిస్తుంటుంది. హుందాత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తూ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయే అత‌గాడి పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. ఒలింపిక్స్ వ్య‌క్తిగ‌త విభాగంలో స్వ‌ర్ణం సాధించిన ఒకే ఒక్క భార‌తీయుడిగా చెప్పొచ్చు. ఆట‌లోనూ.. వ్య‌క్తిత్వంలోనూ త‌న‌దైన ధోర‌ణిలోనే ఉంటాడు త‌ప్పించి.. అంత‌కు మించి ఒక్క అడుగు ఎక్క‌వ కానీ త‌క్కువ కానీ వేయ‌టం అన్న‌ది అత‌నిలో క‌నిపించ‌దు.

సోష‌ల్ మీడియాలో హుషారుగా ఉండే ఆయ‌న‌.. తాజాగా చేసిన ఒక ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. టీమిండియాలో కోచ్ కుంబ్లేకు..కెప్టెన్ కోహ్లీకి మ‌ధ్య‌న పొస‌గ‌ని వైనం తెలిసిందే. బెత్తం ప‌ట్టుకున్న మాష్టారి మాదిరి ఆట‌గాళ్ల విష‌యంలో కుంబ్లే వ్య‌వ‌హ‌రించేవాడ‌ని.. ఆయ‌న వైదొలిగితే మంచిదంటూ కోహ్లీ చేసిన ప‌రుష‌మైన మాట‌తో మ‌న‌స్తాపం చెందిన కుంబ్లే.. కోచ్ ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు.

కుంబ్లే.. కోహ్లీ మ‌ధ్య‌న స‌యోధ్య కుదిర్చేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన బృందం ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. కోచ్ ప‌ద‌వి నుంచి కుంబ్లే వైదొల‌గ‌టానికి కార‌ణ‌మైన కోహ్లీ మీద విమ‌ర్శ‌లు తీవ్ర‌స్థాయిలో ప‌డుతున్నాయి. ఆయ‌న్ను త‌ప్పు ప‌డుతూ ప‌లువురు బాహాటంగానే మండిప‌డుతున్నారు. కొంద‌రైతే తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు కూడా.

ఇలాంటి వేళ‌.. అభిన‌వ్ బింద్రా చేసిన బుల్లెట్ లాంటి ట్వీట్ ఒక‌టి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న తీరుకు భిన్నంగా చేసిన ట్వీట్ తో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఎవ‌రి పేరును నేరుగా ప్ర‌స్తావించ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న టార్గెట్ కోహ్లీ అన్న‌ది ఆయ‌న ట్వీట్ లో స్ప‌ష్టంగా ఉండ‌టం విశేషం. తన అత్యుత్త‌మ గురువుల్లో ఉవి ఒక‌ర‌ని.. ఆయ‌నంటే త‌న‌కు అస‌హ్య‌మ‌ని.. ఆయ‌న మాట‌లు అస్స‌లు వినాల‌నిపించ‌ద‌ని.. కానీ.. ఆయ‌న‌తోనే తాను 20 ఏళ్ల నుంచి ఉన్నాన‌ని చెప్పారు. తాను ఏదైతే విన‌కూడ‌ద‌ని అనుకుంటానో అవే ఆయ‌న చెప్పేవాడ‌ని పేర్కొన‌టం ద్వారా గురువు మాట‌ల‌కు ఎంత విలువ ఇవ్వాల‌న్న విష‌యాన్ని చెప్పేశాడు.

బింద్రా ట్వీట్ అనంత‌రం బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల సైతం ట్వీట్‌తో ఏస్ సంధించారు. త‌న కోచ్ మాట‌లు కూడా త‌న‌కు న‌చ్చ‌వ‌ని.. కానీ ఆయ‌న్ను మాత్రం విడిచి పెట్ట‌న‌ని కోహ్లీ త‌ప్పును చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇంత‌మంది స్పంద‌న త‌ర్వాత.. కోహ్లీ స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.