Begin typing your search above and press return to search.

పుట్టిన‌గ‌డ్డ‌ పైకి అభినంద‌న్‌.. వెంట‌నే భార‌త్ పరీక్ష‌లు

By:  Tupaki Desk   |   1 March 2019 12:48 PM GMT
పుట్టిన‌గ‌డ్డ‌ పైకి అభినంద‌న్‌.. వెంట‌నే భార‌త్ పరీక్ష‌లు
X
భార‌త వాయుసేన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ ను ఇవాళ పాకిస్థాన్ విడుద‌ల చేసింది. వాఘా సరిహద్దు ద్వారా, అతన్ని పాకిస్థాన్ భారత్‌ కు అప్పగించింది. పాక్ సరిహద్దు అయిన వాఘాలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అభినందన్.. ఇండియాలో అడుగుపెట్టాడు. అటారీలోనూ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. ఢిల్లీలో త‌న ఉన్న‌తాధికారుల‌కు ఈ ఘ‌ట‌న గురించి వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

భారత మిలిటరీ స్థావరాలపై దాడికి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ ను తన మిగ్ 21లో తరుముతూ వెళ్లిన అభినందన్.. అది కూలిపోవడంతో పారాషూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో దిగాడు. దీంతో పాక్ ఆర్మీ అతన్ని కస్టడీలోకి తీసుకుంది. అయితే శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ ను తాము విడుదల చేస్తున్నామని గురువారం పాక్ పార్లమెంట్‌ లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు వాఘా సరిహద్దులో ఆయ‌న్ను భారత్‌ కు అప్పగించనున్నారు. అత‌నికి ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన బృందం స్వాగ‌తం ప‌ల‌క‌నుంది. అంతేకాదు అభినంద‌న్ త‌ల్లిదండ్రుల‌తోపాటు సుమారు 20 వేల మంది ప్ర‌జ‌లు స‌రిహ‌ద్దుకు త‌ర‌లిరావ‌డం విశేషం. భార‌త్ మాతా కీ జై నినాదాల‌తో స‌రిహ‌ద్దు మార్మోగిపోతోంది.

కాగా, భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ విడుదల నేపథ్యంలో వాఘా సరిహద్దులో ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరిగే బీటింగ్‌ రిట్రీట్‌ వేడుక రద్దు అయింది. భారత్‌ కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌ కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది. తాజాగా వీరుడిని గౌర‌వించేందుకు ఇది నిర్వ‌హించారు.