Begin typing your search above and press return to search.

ఆ ట్వీట్లకు వారిని లోపలెయ్యమన్నారు!

By:  Tupaki Desk   |   8 May 2015 11:46 AM GMT
ఆ ట్వీట్లకు వారిని లోపలెయ్యమన్నారు!
X
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు 5 సంవత్సరాలు జైలు శిక్ష విదించిన అనంతరం ట్విట్టర్ లో అతిగా స్పందించిన కొందరు సెలబ్రెటీలపై... అదే ట్విట్టర్ వేదికగా విపరీతమైన సెటైర్లు, కౌంటర్లు పడుతున్నాయి. అదే ముందిలే చదివి ఊరుకుందాం... అని అనుకునే లోపు ఆయా సెలబ్రెటీలు చేసిన ట్వీట్లపై కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో అత్యుత్సాహానికి, వారి అవగాహన లోపానికీ పశ్చాత్తాప పడిన సెలబ్రెటీల్లో కొందరు క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. వారిలో ప్రస్తుతం సింగర్ అభిజిత్ భట్టాచార్య, జ్యూయలరీ డిజైనర్ ఫరా ఆలీ ఖాన్‌ లు ఉన్నారు! సల్మాన్ పై అభిమానంతోనో, లేక సల్మాన్ ఫ్యాన్స్ దగ్గర మార్కులు కొట్టేయాలనో కానీ... 'హిట్ అండ్ రన్'కు ప్రభుత్వానిదే బాధ్యత అని ఒకరు... ఫుట్ పాత్ లు ఉన్నది నిద్రపోయేందుకు కాదని మరొకరు... వారికున్న అవగాహన మేర, తదుపరి పరిణామాల గురించి ఆలోచన లేకుండా వీరిద్దరూ ట్విట్ట్ చేసేశారు!
వివరాల్లోకి వెళితే... "రోడ్లమీద పడుకునేది కుక్కలు తప్ప మనుషులు కాదు... అలా పడుకునే వారు కుక్కచావే చస్తారు. ఇళ్లు లేనంత మాత్రాన రోడ్లమీద పడుకోకూడదు" అంటూ సింగర్ అభిజిత్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో.. "హిట్ అండ్ రన్ కేసులో నేరం సల్మాన్ ది కాదు... ఫుట్ పాత్ లపై పడుకున్నవారిది, వారికి ఉండటానికి ఇళ్లు లేకుండా చేసిన ప్రభుత్వానిది" అని ట్వీట్ చేసింది ఫరా అలీ ఖాన్! వీరి ట్వీట్లపై దేశవ్యాప్తంగా అదే ట్విట్టర్ వేదికగా పెద్ద దుమారమే లేచింది!
సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు అతని వాదనలు విన్న జిల్లా అదనపు న్యాయమూర్తి... రెండు గ్రూపుల మధ్య రెచ్చగొట్టేలా, అల్లర్లకు కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను వీరిద్ధరిపైనా ఐపీసీ సెక్షన్ 153, 143-ఎ, 504, 506 నేరాల కింది ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లు చూసి వీరు చేసిన అమర్యాదకరమైన, అనుచిత వ్యాఖ్యలు బాధించి సమీపంలోని ఛత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది ఓజా పేర్కొన్నారు.