Begin typing your search above and press return to search.

సస్పెన్షన్ వేళ.. కోర్టుకు వెళ్లనున్నారా?

By:  Tupaki Desk   |   9 Feb 2020 9:20 AM GMT
సస్పెన్షన్ వేళ.. కోర్టుకు వెళ్లనున్నారా?
X
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై తాజాగా స్పందించారు. తన సస్పెన్షన్ పై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్న ఆయన.. తన స్నేహితులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషుల్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తాను కుంగిపోనని.. మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.

ఈ చర్యను చట్టపరంగా ఎదుర్కొనేందుకు తనకున్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై తీసుకున్న చర్యలపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిబందనల్నిఉల్లంఘించి తప్పులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వెంకటేశ్వరరావును సస్పెన్షన్ వేటు వేసిన వైనం అధికారవర్గాల్లో కలకలంగా మారింది. 1989 బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి ఏపీ క్యాడర్ కు చెందిన వారు. ప్రస్తుతం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా సాగుతున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. అనంతరం ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల వేళలో ఆయన తన అధికారాల్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. బదిలీ తర్వాత ఇప్పటివరకూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఆయనపై ఉన్న ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను కీలక పదవిలో ఉన్న వేళలో.. తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన సంస్థకు సెక్యురిటీ పరికరాల్ని తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనపై వేసిన వేటుపై స్పందించిన ఆయన తీరు చూస్తే.. రానున్న రోజుల్లో ఆయన న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.