Begin typing your search above and press return to search.

ధనిక రాష్ట్రంలో బకాయిల బాకీ లొల్లేంది కేసీఆర్!

By:  Tupaki Desk   |   4 Oct 2016 7:26 AM GMT
ధనిక రాష్ట్రంలో బకాయిల బాకీ లొల్లేంది కేసీఆర్!
X
సంపన్న రాష్ట్రంగా తెలంగాణను తరచూ అభివర్ణిస్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో తప్పేమీ లేదు. సంపన్న రాష్ట్రాన్ని సంపన్నం అంటూ చెప్పుకోవటం ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ.. ఇబ్బంది అంతా ధనిక రాష్ట్రం వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవటంతోనే లొల్లి అంతా. నిధులకు ఏ మాత్రం కొరత లేని రాష్ట్రంలో సకాలంలో నిధులు విడుదల కాక కీలకమైన ఆరోగ్య సేవలు నిలిచిపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

సామాన్యులకు సంజీవిగా ఉంటూ.. వారికి మనో ధైర్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయం మీడియాలో ప్రముఖంగా రావటంతో ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యింది. ప్రైవేటు ఆసుపత్రులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినా.. ఆసుపత్రుల యాజమాన్యు మాత్రం లైట్ తీసుకోవటం గమనార్హం.

శనివారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటంతో.. సామాన్యులు.. బడుగు బలహీన వర్గాల వారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యరు. కీలకమైన ఆపరేషన్లు జరగాల్సిన సమయంలో జరగక.. ప్రైవేటు ఆసుపత్రుల వారి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ఒక సంపన్న రాష్ట్రంలో నిధులు సకాలంలో విడుదల కాకపోవటం కారణంగా కీలకమైన ఆరోగ్య సేవలు నిలిచిపోవటం ఏమిటన్నది పెద్ద ప్రశ్న.

ఇక్కడ ప్రభుత్వ తప్పుతో పాటు.. ప్రైవేటు ఆసుపత్రుల తీరును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో తరచూ కనిపించే నిర్లక్ష్యం కారణంగా నిర్ణయాలు తీసుకోవటంలో నాలుగైదు రోజులు అటుఇటూ అయినా.. సేవల్ని నిలిపివేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులు తెగించటం ఏమిటి? కనీసం ప్రభుత్వానికి నోటీసు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న ఆసుప‌త్రుల‌ ధోరణిని తప్పుపడుతున్నారు. ఇక.. ప్రభుత్వం విషయానికి వస్తే.. తరచూ ధనిక రాష్ట్రమని చెప్పుకోవటంతో సరిపెట్టకుండా.. డబ్బులున్నోళ్లు ఎలా వ్యవహరిస్తారన్న విషయాన్ని కాస్త తెలుసుకొని వ్యవహరిస్తే బాగుంటుందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఇక్కడ ప్రభుత్వాన్ని.. ప్రైవేటు ఆసుపత్రుల్ని పక్కన పెట్టేసి.. సహజంగా మనకు తెలిసిన ఒక ఉదాహరణను తీసుకుందాం. ఎవరైనా బాగా డబ్బులున్న సౌండ్ పార్టీ అనుకోని విధంగా మీ దగ్గర చేబదులు తీసుకున్నారని అనుకుందాం. ఆయన కావాలని కాకున్నా.. తనకున్న పనులతో మీకు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వటం మర్చిపోయారని అనుకుందాం. మీరు వెంటనే.. వెళ్లి ఆయన్ను డబ్బులు అడిగేస్తారా? ఒకవేళ మీకు గొంతు మీదకు వచ్చినా.. ఆయన్ను వెంటనే అడగటానికి మొహమాటపడతారు. కాస్త వెయిట్ చేద్దామని అనుకుంటారు.

వ్యక్తిగతంగానే ఇంత లెక్క ఉంటే.. ఒక ప్రభుత్వంతో.. అదీ సంపన్న సర్కారుతో ప్రైవేటు ఆసుపత్రులు తమకివ్వాల్సిన బకాయిల విషయంలో ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారన్నది ప్రశ్న. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం అంటే.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినట్లే కదా? ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్ర సర్కారు విషయంలో ఇలాంటివి మామూలే అనుకొని సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. సంపన్న సర్కారు విషయంలోనూ ఇలాంటి వైఖరిని ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు ప్రదర్శిస్తున్నాయి? తెలంగాణ ప్రభుత్వం అలాంటి అవకాశాన్ని ఎందుకు ఇస్తోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రైవేటు ఆసుపత్రులు తమ సేవల్ని నిలిపివేసిన వెంటనే వాయు వేగంతో రూ.250 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి.. అంతే స్పీడ్ బకాయిల తుది తేదీ నాటికే ఉండి ఉంటే.. అసలీ పరిస్థితే వచ్చి ఉండేది కాదు కదా..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/