Begin typing your search above and press return to search.

హీటెక్కిన ఢిల్లీ.. ఆప్ వ‌ర్సెస్ బీజేపీ!

By:  Tupaki Desk   |   30 Aug 2022 10:48 AM GMT
హీటెక్కిన ఢిల్లీ.. ఆప్ వ‌ర్సెస్ బీజేపీ!
X
ఢిల్లీలో మ‌ద్యం పాల‌సీ విధానం కాక రేపుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారంలో ఉన్న ఢిల్లీలో కొత్త మ‌ద్యం పాల‌సీ విధానంలో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని.. వంద‌ల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయని బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఎక్సైజ్, విద్యా శాఖ‌ల మంత్రిగా మ‌నీష్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మద్యం పాల‌సీ విధానంలో అక్ర‌మాల‌కు సంబంధించి ప‌లువురిని అరెస్టు కూడా చేసింది.

మ‌రోవైపు ఆప్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంద‌ని.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గుజ‌రాత్‌లో కూడా తాము పోటీ చేయ‌నున్నామ‌ని.. ఈ నేప‌థ్యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా బీజేపీ త‌మ‌ను వివాదాల్లోకి లాగుతున్నార‌ని ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టిన బీజేపీ అధిష్టానం దృష్టి ఇప్పుడు ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డంపై ఉంద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీలో చేరితే 20 కోట్ల రూపాయ‌లు, బీజేపీలో చేర్పిస్తే 25 కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌నీష్ సిసోడియాను కూడా బీజేపీలో చేరాల‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని.. బీజేపీలో చేర‌క‌పోతే ఈడీ, సీబీఐ కేసుల‌తో వేధిస్తున్నార‌ని ఆరోపించారు.

అంతేకాకుండా ఢిల్లీలో న‌లుగురు ఆప్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు ఎర వేసింద‌ని ఆ ఎమ్మెల్యేల‌తోనే కేజ్రీవాల్ ఆరోప‌ణ‌లు చేయించారు. ద‌మ్ముంటే ఒక్క ఆప్ ఎమ్మెల్యేనైనా బీజేపీ కొనుగోలు చేయాల‌ని స‌వాల్ విసిరారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ విధానాల‌పై మండిప‌డుతున్న ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. ఏకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా మీద సీబీఐకి ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 2016లో గ్రామీణ ఖాదీ బోర్డు ఛైర్మన్ గా పనిచేసిన వీకే సక్సేనా.. బీజేపీ పెద్ద నోట్ల‌ను రద్దు చేసిన సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా రూ.1400 కోట్ల పాత నోట్లను మార్పిడి చేశారని ఆప్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఆప్ చెబుతోంది. కాగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్ర‌భుత్వం త‌న సంత‌కం కోసం పంపిన 27 ఏళ్ల‌ను ఫైళ్ల‌ను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా తిప్పి పంపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌క్సేనా బీజేపీ చేతిలో పావుగా మారార‌ని ఆప్ ఆరోపిస్తోంది.

బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఢిల్లీ శాస‌న‌స‌భ‌ను కేజ్రీవాల్ స‌మావేశ‌ప‌రిచారు. సోమ‌వారం రాత్రంతా ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ శాస‌న‌స‌భ‌లోనే ఉన్నారు. మ‌రోవైపు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు.. రాత్రంతా ఢిల్లీ అసెంబ్లీలోనే నిరసన కొనసాగించారు.

మనీలాండరింగ్ కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై ఆరోపణలు చేస్తున్న ఆప్ ఎమ్మెల్యేలు.. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోనే సోమ‌వారం రాత్రంతా నిరసనకు దిగారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై అవినీతి కేసు పెట్టిన ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్... గ‌వ‌ర్న‌ర్ ఆయన 'ఖాదీ స్కామ్'ను అమలు చేశారని విమ‌ర్శించారు.

తాము చేసిన ఫిర్యాదుపై సీబీఐ స్పందించకపోతే న్యాయపోరాటం చేయాలని కూడా ఆప్ భావిస్తోంద‌ని స‌మాచారం. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఆయనను న‌డిపిస్తున్న‌ బీజేపీ కూడా ఇరుకున పడటం ఖాయమని కేజ్రీవాల్ అంచ‌నాగా ఉంద‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలు సీబీఐకి ఇవ్వబోయే ఫిర్యాదు ప్రాధాన్యం రేపుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.