Begin typing your search above and press return to search.

పంజాబీలు చీపురుకే ఓటేశారట?

By:  Tupaki Desk   |   5 Feb 2017 11:48 AM IST
పంజాబీలు చీపురుకే ఓటేశారట?
X
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. శనివారం జరిగిన పోలింగ్ తో గోవా.. పంజాబ్ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రకియ పూర్తి అయ్యింది. ఇక.. ఓట్ల లెక్కింపు మార్చి 11న చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. గతం కంటే భిన్నంగా ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ భారీ పోలింగ్ నమోదైంది.

పంజాబ్ ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు మూడు శాతం మేర ఓట్లు తక్కువగా పోల్ అయినట్లుగా చెప్పచ్చు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78.5 శాతం ఓట్లు పోల్ కాగా.. ఈసారి మాత్రం 75 శాతానికి మాత్రమే పోల్ కావటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. అకాలీ.. బీజేపీలు అధికారంలో ఉన్న పంజాబ్ లో అధికారపార్టీలకు ఎదురుదెబ్బ తగలటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. పంజాబీలు మార్పును బలంగా ఆశిస్తున్నారని.. ఈ నేపథ్యంలో కొత్తగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్ రాయ్ పంజాబ్ వ్యాప్తంగా పోల్ టూర్ నిర్వహించారు. శేఖర్ గుప్తాతో కలిసి జరిపిన తమ పర్యటనలో పంజాబీల్లో అత్యధికులు ఆమ్ పార్టీకి తమ ఓట్లు వేసినట్లుగా చెప్పటం గమనార్హం.

మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ రాష్ట్రంలో.. 69 స్థానాలున్న మాల్వా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేసినట్లుగా తేల్చి చెప్పటం గమనార్హం. పంజాబ్ లో చీపురు పార్టీకి 55 శాతం నుంచి 60 శాతం వరకూ విజయవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అకాలీల ఓట్లు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ వైపునకుమళ్లాయని.. హిందూ ప్రాబల్యం ఉన్న చోట్ల మాత్రం కేజ్రీవాల్ పార్టీకి పెద్దగా ఓట్లు పడలేదన్న మాట వినిపిస్తోంది. పంజాబ్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మోడీకి షాక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/