Begin typing your search above and press return to search.

బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న చీపురు పార్టీ.. గుజ‌రాత్‌లో మార్పుకే ఓటు?

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:16 PM GMT
బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న చీపురు పార్టీ.. గుజ‌రాత్‌లో మార్పుకే ఓటు?
X
చీపురు గుర్తుతో ఢిల్లీ, పంజాబ్‌లను 'ఊడ్చేసిన' ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లోనూ సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ గడ్డపై కేజ్రీవాల్‌ తొడకొడుతున్నారు. తమదైన ఉచితాలతో బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి మోడీ స్వరాష్ట్రంలో బీజేపీ అప్రతిహత విజయపరంపరను కేజ్రీవాల్ ఎలా ఆపుతార‌నేది ఆస‌క్తిగా మారింది. లేక కాంగ్రెస్‌ను దెబ్బతీసి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావటానికి కారణమవుతారా? అన్న‌ది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న ప‌రిణామం.

''గుజరాత్‌లో బీజేపీ మోసం ఇక కొనసాగదు. ఉద్రేకాలు కాదు.. ఉద్యోగాలిస్తాం. స్కూళ్లు కడతాం, మంచి చదువులిస్తాం. ఉచిత వైద్యమిస్తాం. గుజరాత్‌లో పోటీ ఇక మాకు, బీజేపీకి మధ్యే! కాంగ్రెస్‌ కనుమరుగైంది!''.. ఇదీ ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ చేసిన ప్రకటన! గత రెండు నెలల్లో ఆయన ఢిల్లీలో కంటే గుజరాత్‌లోనే ఎక్కువ గడిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని కూడా మొదలెట్టేశారు. అంతేకాదు.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా పరిచయం చేశారు. మొత్తానికి రెండున్నర దశాబ్దాలకుపైగా ద్విముఖపోరుగా కొనసాగుతున్న గుజరాత్‌ ఎన్నికలను ఈసారి ఆప్‌ వచ్చి త్రిముఖ పోరుగా మార్చింది.

గుజరాత్‌లో ఆప్‌ అడుగుపెట్టడం ఇది తొలిసారేం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2017) కూడా కేజ్రీవాల్‌ పార్టీ పోటీ చేసింది. ఒక్కసీటు కూడా గెల్చుకోలేదు. 0.1 శాతం మాత్రమే ఓట్లు సంపాదించింది. అలాగని ఆ అంకెలను చూసి ఆప్‌ను ఈసారి తీసిపారేయలేని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఆప్‌... రాష్ట్రంలో గణనీయమైన పార్టీగా ఎదిగింది. అందరికీ తెలిసేలా విస్తరించింది. సూరత్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి భాజపా తర్వాత అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీగా ఆవిర్భవించింది.

గాంధీనగర్‌లోనూ అదే జరిగింది. పంజాబ్‌లో విజయభేరితో ఆప్‌ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి.. గుజరాత్‌ ఎన్నికల్లో ఈసారి బలమైన ప్రత్యర్థిగా రంగంలోకి దిగటానికి దోహదం చేసింది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా కేజ్రీవాల్‌ అందరికంటే ముందే ప్రకటించేశారు. 300 యూనిట్ల దాకా కరెంట్‌, విద్య, వైద్యం ఉచితం, 18 ఏళ్లపైబడిన మహిళలకు నెలకు రూ.వెయ్యి; రూ.3వేల నిరుద్యోగ భృతి, గోసంరక్షణ కింద ఒక్కో ఆవుకు రోజుకు రూ. 40 లాంటి.. తాయిలాలతో ప్రజల్లో చర్చను లేవనెత్తారు. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్‌లో బీజేపీ ప‌రిస్థితిపై క‌మ‌ల నాథులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.