Begin typing your search above and press return to search.

'ఆప్' ఓపెనింగ్ బాగుందా ?

By:  Tupaki Desk   |   28 Dec 2021 2:30 PM GMT
ఆప్ ఓపెనింగ్ బాగుందా ?
X
తాజా డెవలప్మెంట్ చూసిన తర్వాత అందరికీ ఇదే అనిపిస్తోంది. తొందరలో జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా గెలిచి తీరాలని ఆప్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మధ్యలో బీజేపీ+శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా అవస్థలు పడుతోంది. అన్ని పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ జనాలను ఆకట్టుకునేందుకు హామీలిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి.

35 డివిజన్లుండే ఈ కార్పొరేషన్లో ఆప్ 14 డివిజన్లలో విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలిచిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేయర్ స్థానాన్ని ఆప్ ఖాతాలో వేసుకోవటం దాదాపు ఖాయమైపోయింది. 12 స్ధానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 8 డివిజన్లలో కాంగ్రెస్, ఒకే స్ధానంతో అకాలీదళ్ గెలిచాయి. నిజానికి ఆప్-బీజేపీ మధ్య తేడా రెండు డివిజన్లే అయినా అవసరమైతే ఆప్ కు మద్దతివ్వటానికి కాంగ్రెస్ రెడీగా ఉంది. కాబట్టి మేయర్ స్థానం విషయంలో కమలం పార్టీ ఆశలు ఆవిరైపోయినట్లే.

ఇక్కడ గమనించాల్సిందేమంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక తీర్పు ప్రజల మూడ్ కు అద్దం పడుతోందనే అనుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఆప్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 51 సీట్లలో గెలుస్తుందని ఇప్పటికే అనేక ప్రీ పోల్ సర్వేల్లో బయటపడింది. మొత్తం 117 సీట్లలో 51 సీట్లంటే సగం సీట్లు కాదు. కానీ మన దగ్గర 50 శాతం సీట్లని లేదా ఓట్లని రూల్ లేదు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఈ పద్ధతిలో ఆప్ అధికారం అందుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అర్దమవుతోంది.

సో తాజాగా వెల్లడైన చండీగఢ్ కార్పొరేషన్ ఫలితాలతో ఆప్ మంచి జోష్ మీదున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ట్రయల్ రన్ లో తమ పార్టీ గెలుపు అదిరిపోయినట్లు కేజ్రీవాల్ మంచి ఖుషీగా ఉన్నారు. ఢిల్లీలో తన పరిపాలను చూసిన తర్వాత పంజాబ్ లో ఓట్లు వేయమని కేజ్రీవాల్ చేస్తున్న విజ్ఞప్తి పంజాబ్ ఓటర్లపై బాగానే సానుకూల ప్రభావం చూపుతోందనే చర్చ మొదలైపోయింది. పైగా ఇప్పటికే పంజాబ్ లో 20 మంది ఎంఎల్ఏలతో ఆప్ గట్టి ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి తాజా సంకేతాలతో పంజాబ్ లో ఆప్ దే విజయమని అనుకుంటున్నారు.